Chiranjeevi Tweet on Taraka Ratna Health: నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని ట్విటర్ వేదికగా తెలిపారు. ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందన్న చిరంజీవి.. త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. తారకరత్నను కాపాడిన వైద్యులు, దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విషమంగానే తారకరత్న ఆరోగ్యం: గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన సినీనటుడు నందమూరి తారకరత్నకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొననసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. ‘తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పైనే ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నాం. మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్లు ఆయనకు ఎక్మో వ్యవస్థ ఏర్పాటు చేయలేదు.
తారకరత్న కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని అందిస్తున్నాం’ అని తాజా నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిత్యం తారకరత్న కుటుంబసభ్యులతోనే ఉంటూ వైద్యులతో సంప్రదిస్తున్నారు. సోమవారం కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఆస్పత్రికి వచ్చి, తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించారు.