Congress party Meeting: మునుగోడు ఉప ఎన్నికలపై ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ మునుగోడు ఉపఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, , నియోజకవర్గ కమిటీ కన్వీనర్ మధుయాష్కీలతోపాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశం మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశాలల్లో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల అంశంపైనే చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిట్టింగ్ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్ ప్రారంభించింది. నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఆశావహులతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు.
మునుగోడు స్థానాన్ని మళ్లీ హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ చురుగ్గా పావులు కదుపుతోంది. అందులోభాగంగా గాంధీభవన్‌లో నల్గొండ జిల్లా, మునుగోడు నేతలతో బోసురాజుతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ విప్ అనిల్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లతో పాటు నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్న నియోజకవర్గ నేతలు పాల్వాయి స్రవంతి, చల్లమల కృష్ణారెడ్డి, కైలాష్‌నేత, పల్లె రవికుమార్‌లు ఇందులో పాల్గొన్నారు. ఉపఎన్నికకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకుల సలహాలు తీసుకున్నారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని స్పష్టం చేశారు.