తెలంగాణ

telangana

ETV Bharat / state

Godavari Kaveri Rivers link: 'గోదావరి- కావేరి అనుసంధానానికి కసరత్తులు'

నదీ జలాల లభ్యత, మిగులుకు సంబంధించిన ఖచ్చితమైన అధ్యయనాలు జరిగాకే గోదావరి- కావేరీ అనుసంధానంపై ముందుకెళ్లాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేశాయి. ఎక్కువగా భూసేకరణ జరుగుతున్నందున మళ్లించే నీటిలో సగం వాటా కావాలని తెలంగాణ కోరగా... దిగువ గోదావరితో పాటు తమ ప్రాజెక్టులు, వాటాకు ఎలాంటి భంగం కలగరాదని ఏపీ తెలిపింది. తమ నికర జలాల వాటాలోని 77 టీఎంసీల నీటి మళ్లింపు తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఛత్తీస్​గఢ్​ స్పష్టం చేసింది. రాష్ట్రాల అభిప్రాయాలకు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని నెల లోపు అందిస్తే తదుపరి ప్రక్రియ చేపడతామని జాతీయ జల అభివృద్ధి సంస్థ పేర్కొంది.

Godavari Kaveri Rivers link
Godavari Kaveri Rivers link

By

Published : Oct 29, 2021, 7:16 PM IST

గోదావరి- కావేరీ నదుల అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వేదికగా రెండో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. ఎన్​డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు దృశ్యమాద్యమం ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

మూడు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించేలా

జూన్ నుంచి అక్టోబర్ వరకు 143 రోజుల పాటు 247 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జున్ సాగర్, సోమశిల ద్వారా కావేరీ వరకు మళ్లించే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​పై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని దాదాపు పది లక్షల హెక్టార్లకు సాగునీరుతో పాటు 1.41 కోట్ల మందికి తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 86 వేల కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. 1,211 కిలోమీటర్ల మేర కాలువలు, తొమ్మిది కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది.

అంగీకారయోగ్యం కాదన్న ఛత్తీస్​గఢ్

ఇచ్చంపల్లి నుంచి మూసీ వరకు నాలుగు దశల్లో 129 మీటర్ల మేర నీటిని ఎత్తిపోస్తారు. ప్రాజెక్టుకు 1497 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇచ్చంపల్లి నదీ ప్రాంతంలో 9,300 హెక్టార్లు, కాల్వల కోసం 31,680 హెక్టార్ల భూసేకరణ అవసరం. అందులో 2,458 హెక్టార్లు అటవీ భూములు. 75 శాతం లభ్యతతో 177 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయని, ఛత్తీస్​గఢ్​ వాటాలో వినియోగించుకోని 77 టీఎంసీలను మొదటిదశలో మళ్లిస్తామని ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. తాము భవిష్యత్​లో ప్రాజెక్టులు నిర్మిస్తామని... తమ వాటా నుంచి 77 టీఎంసీల నీటిని మళ్లించే ప్రతిపాదన తమకు ఎంత మాత్రమూ అంగీకారయోగ్యం కాదని ఛత్తీస్​గఢ్​ స్పష్టం చేసింది.

కచ్చితమైన అధ్యయనం జరగాలన్న తెలంగాణ.. తమ వాటాకు భంగం కలగొద్దన్న ఏపీ

75 శాతం నీటి లభ్యతతో అన్ని మిగులు జలాలు లేవన్న తెలంగాణ... నీటిలభ్యతపై పూర్తి స్థాయిలో హైడ్రాలజీ అధ్యయనం జరగాలని స్పష్టం చేసింది. భాగస్వామ్య రాష్ట్రాల ఆమోదంతో ఆ తర్వాత ముందుకెళ్లాలని తెలిపింది. ప్రాజెక్టు కోసం ఎక్కువ భూమిని తెలంగాణలో సేకరిస్తున్నందున మళ్లించే నీటిలో సగం వాటా ఇవ్వాలని కోరింది. 50 శాతం లభ్యతతోనూ మిగులు జలాలు లేవన్న ఆంధ్రప్రదేశ్... దిగువ గోదావరిలో తమ ప్రయోజనాలకు భంగం కలగకుండా రక్షణ ఎక్కడుందని ప్రశ్నించింది. మహానది- గోదావరి అనుసంధానం చేపట్టాలని... ఏపీలోని ప్రస్తుత, భవిష్యత్​లో చేపట్టే ప్రాజెక్టులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుస్తున్న నేపథ్యంలో వాటి నుంచి నీరందుతున్న ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. అభిప్రాయాలు చెప్పిన రాష్ట్రాలు వాటికి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని ఇస్తే పరిశీలిస్తామని జాతీయ జల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు. సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని... నెల రోజుల్లోపు రాష్ట్రాల నుంచి వివరాలు అందాక తదుపరి ప్రక్రియ కొనసాగిస్తామని అన్నారు.

మార్పులు సూచించిన తమిళనాడు

అనుసంధాన ప్రాజెక్టు అలైన్​మెంట్​లో కొన్ని మార్పులు సూచించిన తమిళనాడు... తమ ప్రాజెక్టులకు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. తమ ప్రాంత అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేరళ కోరింది. మిగతా రాష్ట్రాలన్నీ కూడా అనుసంధానానికి అనుకూలంగా తమ అభిప్రాయాలు చెప్పాయి.

ఇదీ చూడండి:Godavari Kaveri River linking project: గోదావరి-కావేరి అనుసంధానంపై భేటీ.. తెలంగాణ, ఏపీ ఏం కోరాయంటే...

ABOUT THE AUTHOR

...view details