Congress Focused Munugode Bypoll: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై నేతలతో చర్చించామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నేటి నుంచి ఈనెల 14 వరకు ముఖ్యనేతలు ప్రచారంలోనే ఉంటారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మునుగోడులో ప్రచారానికి వస్తారని రేవంత్ స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. రెండు రోజుల్లో పాదయాత్ర రూట్ మ్యాప్‌పై స్పష్టత ఇస్తామని తెలియజేశారు. భాజపా, తెరాస మధ్య మిత్ర భేదమే తప్పా.. శత్రు భేదం లేదని ఆరోపించారు. వాటాల పంపకంలోనే తెరాస, భాజపా మధ్య పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. గులాబీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని తెలిపారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరు లేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ఎలాంటి వ్యూహం అవలంభించాలనేదానిపై చర్చించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.