పోడు భూముల అంశంపై రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్షాల నేతల సమావేశం జరిగింది. పోడు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో... 'పోడు భూముల సమస్య- ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై' చర్చ జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరామ్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అనేక తరాలుగా భూములు దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?
పోడు భూముల అంశంపై చర్చించేందుకు అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పోడు రైతులను భాగస్వామ్యం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపకల్పన చేసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించే హక్కు ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. మూడు మాసాల తర్వాత పొడగించుకునే హక్కు గ్రామసభకు ఉంటుందన్నారు. ఇది పోడుదారుల జీవిత సమస్య అని పేర్కొన్నారు. నిన్న భాజపాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడినంత మాత్రాన ఎవరూ విశ్వసించరని తెలిపారు.
పోడుదారుల బతుకులు ఎడారిగా మారుతున్నాయి. అటవీ హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చట్టంలో లోపాలు సవరించేందుకు అవసరమైతే పోడుదారులను దిల్లీ తీసుకెళతామన్నారు సీఎం కేసీఆర్. పోడు, రెవెన్యూ భూముల సరిహద్దు సమస్య తీరలేదు. ఇప్పటికైనా చట్టం పరిధిలో చర్యలు తీసుకోవాలి.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలి
పోడు భూముల అంశంపై రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలని తెజస అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. సంప్రదాయంగా అడవులలో నివసించే కుటుంబాలను గుర్తించాలన్నారు. భూమి, అడవిపై హక్కల విషయంలో శాటిలైట్‌పై ఆధాపడతామంటే కుదరదన్నారు. అనేక తరాలుగా భూములు దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.