రాష్ట్రానికి సమగ్ర నీటిపారుదల నిర్వహణ విధాన రూపకల్పనతో పాటు శాఖ పునర్వ్యవస్థీకరణపై సాగునీటి శాఖ కార్యశాల నిర్వహించింది. హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన సదస్సులో ఈఈ నుంచి ఈఎన్సీల వరకు మొత్తం 250 మంది ఇంజినీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్ర విధాన రూపకల్పన, శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీర్ల అభిప్రాయాలు సేకరించారు.
ఇంజినీర్ల పాత్ర క్రియాశీలకంగా ఉండాలి..
సమగ్ర విధానాన్ని రూపొందించడంతో పాటు సాగునీటి శాఖ ఆస్తులు, ఇతర సాంకేతికాంశాలు, సహాయక సేవలు, చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం తదితర అంశాలపై కార్యశాలలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలైన కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణిలో ఈఈల పాత్ర క్రియాశీలకంగా ఉందని.. విధాన రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో 80కి పైగా పంప్ హౌజ్ లు పని చేయనున్నందున ఎత్తిపోతల పథకాలను సమర్థంగా నిర్వహించేందుకు సమగ్ర విధానం కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తెలిపారు.