అన్నం పెట్టే అన్నదాతపై దళారుల దాడి నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన రైతు చంద్రయ్య... బొప్పాయి పంట అమ్ముకోవడానికి హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్‌కు వచ్చారు. మార్కెట్‌లో వేలం పాట పూర్తైన తర్వాత... ఒక దళారీ వచ్చి అనుమతి లేకుండా మూడు బొప్పాయి పండ్లు తీసుకుని వెళ్తుండగా... చంద్రయ్య అడ్డు చెప్పారు. తమకే అడ్డు చెబుతావా మీ బతుకెంత అంటూ దళారులు రైతుపై దాడి చేశారు. అడ్డుకోబోయిన సోదరుడు వెంకట్‌పై కూడా చేయి చేసుకున్నారు.
స్టేషన్‌లో ఫిర్యాదు..
ఈ ఘటనపై చంద్రయ్య.. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వం... వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో దళారులు, కమీషన్ ఏజెంట్ల దాడులు బాధాకరమని చంద్రయ్య వాపోయారు.
ధరల మయాజాలం..
బహిరంగ విపణిలో మంచి ధరలు పలుకుతున్న సమయంలో కూడా... మామిడి, బత్తాయి, దానిమ్మ, ఆపిల్, ద్రాక్ష... ఇలా ఏ పంట తీసుకెళ్లినా సిండికేటైన వర్తకులు, కమీషన్ ఏజెంట్లు కృత్రిమంగా ధరలు తగ్గించేసి రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడికి దిగుతున్నారు. మార్కెట్‌లో కిలో బొప్పాయి రూ.40 నుంచి రూ.55 ధర పలుకుతుండగా బయట కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.
మంత్రి ఆగ్రహం...
ఈ ఘటనపై మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయితో ఫోన్‌లో మాట్లాడారు. దళారులు రైతుల్ని పీడించడం తగదని, తక్షణమే బాధ్యుల లైసెన్స్ రద్దు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇక నుంచి దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు