తెలంగాణ

telangana

ETV Bharat / state

విచ్చలవిడిగా ఔషధ విక్రయాలు - hyderabad today news

రాష్ట్రంలో విచ్చలవిడిగా వైద్యుల చీటీ లేకుండా ఔషధ దుకాణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు వైద్యుని చీటీ లేకుండా దగ్గు మందును కొనుగోలు చేయడం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఓ వ్యక్తి తరచూ నొప్పి నివారణ మాత్రలు వాడి చివరకు మూత్రపిండాలకు ప్రమాదం ఏర్పడింది. గతేడాది జరిగిన దాడుల్లో షాపులపై 3771 కేసులు సైతం నమోదయ్యాయి.

medicine selling individual at telangana medical shops
విచ్చలవిడిగా ఔషధ విక్రయాలు

By

Published : Jan 14, 2020, 7:16 AM IST

రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా వైద్యుల చీటీ లేకుండా ఔషధ దుకాణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ఔషధ దుకాణంలో మధుమేహ చికిత్స ఔషధాలను వైద్యుని చీటీ చూపించి ఓ వినియోగదారుడు కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి ఔషధాలను పరిశీలించగా చీటీలో ఉన్నది కాకుండా మరో ఔషధాన్ని దుకాణాదారు ఇచ్చినట్లు గుర్తించాడు. తక్షణమే వెళ్లి ఆరా తీయగా, పొరపాటు జరిగిందని చెప్పి, నిర్దేశించిన ఔషధాన్ని ఇచ్చాడు. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

  • కరీంనగర్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఇంట్లో తెలియకుండా తరచూ దగ్గు మందు కొంటున్నాడు. ఇతను దీర్ఘకాలంగా దీన్ని మత్తు మందుగా వినియోగిస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నిబంధనలను ఉల్లంఘించి దగ్గు మందును చీటీ లేకుండా విక్రయించిన దుకాణంపై అధికారులు చర్యలు చేపట్టారు.
  • నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వాంతులు, జ్వరంతో ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యుల పరీక్షలో తేలింది. కారణాలను అన్వేషించగా ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న తను తరచూ నొప్పి నివారణ మాత్రలు వాడుతుంటానని వెల్లడించాడు. దీర్ఘకాలం నొప్పి నివారణ మాత్రలు వాడితే మూత్రపిండాల పనితీరు మందగిస్తుందని వైద్యులు తెలిపారు.

వైద్యనిపుణులు తరచూ చెబుతున్నా..

ఔషధాన్ని మితంగా వాడితేనే ఆరోగ్యం అంటూ వైద్యనిపుణులు తరచూ చెబుతున్నా.. దీనిపై అవగాహన లేక అనేకమంది కొత్తగా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సాధారణ జలుబు, దగ్గు మొదలుకొని గొంతునొప్పి, ఇతర ఇన్‌ఫెక్షన్ల కారణంగా జ్వరం, ఒళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి తదితర అనారోగ్యాలకూ ఇష్టానుసారంగా ఔషధాలను వినియోగించే ధోరణి పెరిగిపోయింది. ఔషధ దుకాణాలు కూడా వైద్యుని చీటీ లేకుండా మందులివ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ఔషధ దుకాణాల్లో అర్హులతో కాకుండా ఎవరితో పడితే వారితో ఔషధాలను అందజేయడం రోగుల ప్రాణాల మీదకొస్తోంది. ఈ తరహా ఫిర్యాదుల కారణంతో 2019లో తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఔషధ దుకాణాలపై దాడులు చేసి 3771 కేసులను నమోదు చేసింది. ఈ తరహా అక్రమ విక్రయాల్లో రాష్ట్రంలో నిజామాబాద్‌ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది.

‘మత్తు’గా దగ్గు మందు
వైద్యుని చీటీ లేకుండా దగ్గు మందును అమ్మకూడదు. కానీ కొన్ని ఔషధ దుకాణాలు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నాయి. కొన్నిరకాల దగ్గు మందు ద్రావణాన్ని మాదక ద్రవ్యంగా కొందరు యువకులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాలు నిబంధనలను నీళ్లొలుతున్నాయి. రూ.కోట్ల అమ్మకాలు జరుగుతున్నా.. వాటిల్లో 50 శాతం వరకూ బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫలితంగా ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

కఠిన చర్యలు తప్పవు
ఔషధ విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే ఔషధ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకులు బి.వెంకటేశ్వర్లు అన్నారు. గతేడాది నమోదు చేసిన కేసుల్లో.. అత్యధికం అర్హుడైన ఫార్మాసిస్టు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నవి. బిల్లుల్లేకుండా అమ్మకాలు. వైద్యుని చీటీ లేకుండా ఔషధాలివ్వడం వంటివి ఎక్కువగా ఉన్నాయి.

వైద్యుని చీటీ తప్పనిసరి
దీర్ఘకాలం యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తే శరీరంలో నిరోధకత పెరుగుతుందని ఉస్మానియా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. భవిష్యత్‌లో యాంటీబయాటిక్స్‌ను వినియోగించాల్సి వచ్చినపుడు ఔషధం పనిచేయదన్నారు. మూత్రపిండాలు దెబ్బతింటాయి, జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడతాయి. కాలేయం దెబ్బతినే ప్రమాదముందని, ఏ ఔషధాన్నైనా వైద్యుని సూచనల ప్రకారం తీసుకోవడం మేలని సూచించారు.

ఇదీ చూడండి : ఒకే వేదికపై పతంగులు, మిఠాయిలు స్నాక్స్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details