తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెల్లో సర్కారీ వైద్యం అందుతోందా? కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి? - Medical posts in rural Telangana are hugely vacant

గ్రామీణ తెలంగాణలో వైద్యుల పోస్టులు (Medical posts) నియామకాలకు నోచుకోవడం లేదు. పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయి. సగం పీహెచ్‌సీల్లోనే 24 గంటల సేవలు అందుతున్నాయి. 2019-20 గ్రామీణ ఆరోగ్య గణాంకాల్లో వెల్లడించాయి.

Medical posts in rural Telangana are hugely vacant
గ్రామీణ వైద్యం అంతంత మాత్రం.. నియామకాలకు నోచుకోని వైద్యుల పోస్టులు

By

Published : Oct 13, 2021, 7:46 AM IST

గ్రామీణ తెలంగాణలో వైద్య పోస్టులు (Telangana are hugely vacant) భారీగా ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లోనూ వైద్యుల పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోలేదు. నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు సహా అన్ని రకాల పారామెడికల్‌ పోస్టుల్లోనూ ఇదే తీరు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2019-20’ ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. దీనివల్ల ప్రాథమిక, మాధ్యమిక వైద్యంపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటేనే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు.

పురుషులు, స్త్రీలకూ ఒకే మరుగుదొడ్డి

  • 01.07.2020 మధ్యంతర జనాభా గణాంకాల ప్రకారం.. తెలంగాణ గ్రామీణంలో 2,04,01,000 జనాభా ఉంది. నిబంధనల ప్రకారం ఈ జనాభాకు 726 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)ఉండాలి. ప్రస్తుతం 636 ఉన్నాయి. 4,744 ఆరోగ్య ఉపకేంద్రాలకుగాను 4,450 ఉన్నాయి. 191 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు (సీహెచ్‌సీ) గానూ.. ప్రస్తుతం 85 ఉన్నాయి.
  • 4,744 ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎక్కడా మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం ఆ మేరకు సౌకర్యాలున్నాయి.
  • రాష్ట్రంలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో 1,273 మాత్రమే ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 2,694 అద్దె భవనాలలో, మరో 777 పంచాయతీలు, ఇతర స్వచ్ఛంద సంస్థల భవనాల్లో ఉన్నాయి. వీటన్నింటికీ (3,471) కొత్త భవనాలను నిర్మించాల్సి ఉంది.
  • ప్రతి 1000 జననాలకు తొలి ఏడాది లోపు గ్రామీణంలో 30 మంది, పట్టణాల్లో 21 మంది శిశువులు మృతిచెందుతున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల సగటు మరణాలు 32 నమోదుకాగా, తెలంగాణలో అది 27గా ఉంది.
  • 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ సేవలందించేవి కేవలం 324(50.9 శాతం) మాత్రమే. అన్నింటిలోనూ కాన్పు గదులు, శస్త్రచికిత్స గదులను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. కనీసం 4 పడకల సౌకర్యం ఉంది.
  • దాదాపు 90.4 శాతం పీహెచ్‌సీల్లో టెలిఫోన్‌, కంప్యూటర్‌, అంబులెన్సు వసతులున్నాయి.
  • ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌(ఐపీహెచ్‌ఎస్‌) నిబంధనల మేరకు నిర్వహిస్తున్న పీహెచ్‌సీలు రాష్ట్రంలో 331 ఉన్నాయి.
  • రాష్ట్రంలోని 85 సీహెచ్‌సీల్లో నలుగురు స్పెషలిస్టు వైద్యులు సేవలందిస్తున్నవి 45 మాత్రమే. అన్నింటిలోనూ కాన్పు గదులున్నాయి.
  • 18 సీహెచ్‌సీల్లో మాత్రమే పుట్టగానే శిశువును శుభ్రపర్చి ఆరోగ్యాన్ని స్థిరపరిచే గదులున్నాయి. అన్నింటిలోనూ నవజాతశిశు సంరక్షణ కేంద్రాలున్నాయి.
  • సీహెచ్‌సీల్లో ఎక్స్‌రే మిషన్లున్నవి 54. అంబులెన్సులు మాత్రం అన్నింటిలోనూ ఉన్నాయి. ఐపీహెచ్‌ఎస్‌ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నవి 41 మాత్రమే.
  • సీహెచ్‌సీలో 85 ఆయుష్‌ స్పెషలిస్టులు పోస్టులు అవసరం కాగా..ఒక్కటీ మంజూరు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details