రాష్ట్రవ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు రెండువేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఒక్క హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే 318 మంది సిబ్బందికి వైరస్ సోకింది. మొదటిదశలో 68, రెండో 250 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో నలుగురు మరణించారు. రాష్ట్ర, జిల్లా, ఏరియా ఆసుపత్రులేగాక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. వరంగల్ జిల్లాలోని ఖానాపురం ఆరోగ్యకేంద్రంలో 12 మంది సిబ్బందిలో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా అనంతరం ఏర్పడ్డ ఆపత్కాలంలో రోగులకు భరోసా ఇస్తోంది వైద్యఆరోగ్య ఉద్యోగులే. అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నా సరే పలువురికి గండం తప్పడం లేదు. రోగుల మధ్యే ఎక్కువగా విధులు నిర్వర్తించడం, విధుల నుంచి రిలీవ్ అయ్యే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు వారికి ఉన్న ఆరోగ్యపరమైన సమస్యల కారణంగానూ కరోనా సోకుతోంది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
చికిత్సకు హైదరాబాదే దిక్కు
పనిచేసే చోట చాలా మంది చికిత్స పొందుతున్నా... పరిస్థితి అదుపు తప్పిన తర్వాత వీరిలో కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. లక్ష వరకు కరోనాకు వెచ్చించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ మొత్తం ఏమూలకూ సరిపోవడం లేదు. కరోనాతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చింది పోను మిగిలిన మొత్తం భారం కుటుంబాలపై పడుతోంది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఈ సదుపాయం లేకపోవడంతో డబ్బు కోసం వారు నానాయాతన పడుతున్నారు.
బీమా కొందరికే..
కరోనా విధుల్లో ఉండి చనిపోయే ఆరోగ్యకార్యకర్తలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద రూ.50 లక్షల బీమా సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికింద మొదటి విడత మరణించిన 46 మందిలో 41 కుటుంబాల వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21 మందికి మాత్రమే సాయం అందింది. పథకం అమలులో కాలయాపన వల్ల బాధితులకు సత్వర సాయం అందడం లేదు.
బూర రవి (54). వరంగల్ డీహెచ్‌ఎంవో కార్యాలయంలో ఆరోగ్య విస్తరణాధికారి. విధుల్లో ఉండగా కరోనా వచ్చింది. ఆయన భార్య కవితకూ సోకింది. ఆసుపత్రిలో చేరినా నయం కాలేదు. రవి పరిస్థితి విషమించి గతనెల 5వ తేదీన మరణించారు. ఆయన భార్య కూడా 14న కన్నుమూశారు. పెళ్లికి ఎదిగిన ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
రావుల రామకృష్ణ (34) హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. ఏప్రిల్ మూడో మొదటి వారంలో విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 14న చనిపోయారు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సంపాదించే వ్యక్తి చనిపోవడంతో కుటుంబానికి ఆధారం కరవైంది.