రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక జ్వరం వచ్చినప్పుడు నీరు తగినంతగా తాగడం ఎంత ముఖ్యమో.. పోషకాహారం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తినడం వల్ల వేగంగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాహారం అందకపోతే:శరీరం ఇన్‌ఫెక్షన్ల బారినపడిప్పుడు.. వాటిని ఎదుర్కోవడంలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. దానిని బలంగా ఉంచడంలో పౌష్టికాహారం దోహదపడుతుంది. పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ప్రొ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్ పెరిగి మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, చెడ్డవాటిని పెంచుతుంది. దీనివల్ల మరింతగా ఆరోగ్యం క్షీణిస్తుంది.
జ్వరం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒంట్లో నుంచి నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతుంటాయి. కొందరికి విరేచనాలు, వాంతులు కావడం వల్ల కూడా ఒంట్లోంచి నీరు, లవణాలు వెళ్లిపోతాయి. ఇలాంటి సమయాల్లో శరీరానికి తగినంత నీరు, లవణాలు, పోషకాహారాన్ని అందించలేకపోతే.. వీటి వల్ల ఇంకా శరీరం కుంగిపోయి రక్తపోటు పడిపోతుంది. బాగా నీరసం, లేవలేని పరిస్థితులు వస్తాయి.
రోగ నిరోధక శక్తి సమకూరేదిలా:పౌష్టికాహారాన్ని రెండు రకాలుగా చెబుతారు. 1. మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్లు, ఖనిజాలు(మినరళ్లు) 2. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, కొవ్వులు(ప్రొటీన్స్ అండ్ ఫ్యాట్స్). రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే మ్యాక్రో న్యూట్రియంట్లతో పాటు మైక్రో న్యూట్రియంట్లు ఉండాల్సిందే. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. విటమిన్ ఏ, సీ, డీ, ఈ లు శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏ ఆహారాల్లో ఏముంటాయి?
విటమిన్ ఎ:యాంటీ జెన్, యాంటీబాడీస్ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది. చిలగడదుంప(స్వీట్ పొటాటో), క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తాయి.
విటమిన్ సి: కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, పచ్చిమామిడి, దానిమ్మ, ద్రాక్ష, తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, క్యాప్సికం, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, నిమ్మలో ఎక్కువగా లభిస్తుంది. త్రిఫల చూర్ణం(ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల పొడి) వాడటం మేలు చేస్తుంది. కరక్కాయ జీర్ణ వ్యవస్థపై, తానిక్కాయ ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపర్చడంపై బాగా పనిచేస్తాయి.