తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం

ప్రభుత్వ ప్రయోగాశాలల్లో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల్లో జరుగుతున్న జాప్యంపై వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విస్తృతంగా నమూనాలను సేకరిస్తుంటే.. వాటి ఫలితాలను మూణ్నాలుగు రోజులైనా వెల్లడించకపోవడానికి కారణాలేంటని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రశ్నించారు.

కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం
కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం

By

Published : Jul 9, 2020, 9:22 AM IST

ప్రభుత్వ ప్రయోగశాలల్లో కరోనా నిర్ధరణ పరీక్ష ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యంపై వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల అన్ని ప్రయోగశాలల బాధ్యుల (ఇంఛార్జుల)తో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

ఓ వైపు రాష్ట్రంలో విస్తృతంగా నమూనాలను సేకరిస్తుంటే.. వాటి ఫలితాలను మూణ్నాలుగు రోజులైనా వెల్లడించకపోవడానికి కారణాలేంటి అని ఈ సందర్భంగా శాంతికుమారి.. ఆయా ప్రయోగశాలల బాధ్యులను ప్రశ్నించినట్లు తెలిసింది. సాంకేతిక నిపుణుల కొరత ఉందని, కొందరు భయంతో ఉద్యోగం మానేయగా, కొవిడ్‌ సోకడం వల్ల మరికొందరు విధులకు హాజరు కావడం లేదని సంబంధిత ప్రయోగశాలల బాధ్యులు వివరించారు.

ఈ వివరణలపై సంతృప్తి చెందని అధికారులు.. గాంధీ ఆసుపత్రి ల్యాబ్‌ బాధ్యురాలిగా పనిచేస్తున్న వైద్యురాలిని ఉస్మానియా వైద్య కళాశాల ప్రయోగశాలకు మార్చారు. అక్కడే పనిచేస్తున్న మరో వైద్యురాలికి గాంధీ ల్యాబ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) బాధ్యతలను కూడా అందులో పనిచేస్తున్న మరో అధికారికి అప్పగించినట్లు సమాచారం.

ప్రైవేటు బోధనాసుపత్రులకు ఉచితంగా కరోనా మందుల సరఫరా

ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ కొవిడ్‌ చికిత్సలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయా చికిత్సలకు అవసరమైన ఔషధాలను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కొవిడ్‌ చికిత్సలో అవసరమయ్యే దాదాపు 55 రకాల ఔషధాలు, పరికరాలను గుర్తించింది. పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు, ఇతర సర్జికల్‌ మాస్కులను సరఫరా చేయనుంది. ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర మానవ వనరులను ఆయా ఆసుపత్రులు అందిస్తుండగా.. చికిత్సకయ్యే ఇతర వస్తువులు, ఔషధాలను మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

వైద్య సిబ్బందికి నిమ్స్‌లో కొవిడ్‌ చికిత్స

ప్రభుత్వ వైద్యంలో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడితే.. వారికి ఇకనుంచి నిమ్స్‌లోని ప్రత్యేక విభాగంలో చికిత్స అందించనున్నారు. దీనిపై ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలిచ్చారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు నిమ్స్‌ సంచాలకులకు బుధవారం లేఖ రాశారు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details