Mediation Techniques Awareness in Hyderabad: న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో.. 'మధ్యవర్తిత్వంలో మెళకువలు' అనే అంశంపై హైకోర్టు న్యాయమూర్తులకు.. మూడు రోజుల అవగాహనలో పాల్గొన్నారు. న్యాయమూర్తిగా కేసులను చట్టప్రకారం తేలుస్తాం కానీ.. మధ్యవర్తిత్వంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సూచించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సదస్సులో పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, పలువురు నిపుణులు మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10.80 లక్షల కేసులు పెండింగ్: ఏదైనా వివాదంలో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా అంగీకరించి, పరిష్కరించుకునేందుకు ముందుకొస్తేనే నిర్వహించాల్సిన ప్రక్రియ మధ్యవర్తిత్వమని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ఇలా మీడియేషన్ నిర్వహించడానికి మధ్యవర్తికి మెలకువలు అవసరమని స్పష్టం చేశారు. మధ్యవర్తికి సహనంతో వినే కళ ఉండాలన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉద్వేగపూరితమైన ముగింపునిచ్చి, బంధాలను పెంచితే విజయవంతమైన మధ్యవర్తిగా నిలుస్తారని చెప్పారు. న్యాయమూర్తులకూ మధ్యవర్తిత్వంపై అవగాహన, సరైన శిక్షణ, మెలకువలు అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు, కింది కోర్టుల్లో 10.80 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలాంటిచోట 10 నుంచి 20 ఏళ్లపాటు కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తూ మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
"నేను అర్థం చేసుకున్న సమస్య ఏంటంటే.. దిల్లీ, బెంగళూరు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శిక్షణ పొందిన మధ్యవర్తులు లేరు. శిక్షణ పొందిన మధ్యవర్తులు లేకపోవడం తీవ్రమైన సమస్యగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వంలో శిక్షణ, మెలకువలు పొందకపోతే మంచి మధ్యవర్తి కాలేరు." - జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి