అటు రాష్ట్రంలో.. ఇటు రాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కరోనా పరీక్షల కేంద్రాల సంఖ్యను రెండింతలు పెంచాలి. కానీ ఈ విషయంలో వైద్యశాఖ తక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. పెద్దఎత్తున పరీక్షలను చేయడానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వీటిలో పరీక్షలు చేయడానికి అధికారులు అనుమతివ్వడం లేదు. ఫలితంగా పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య అధికమై.. పాజిటివ్ కేసులు పెరిగి.. ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. ఈ ఆలస్యం కారణంగా పాటిజివ్ వ్యక్తుల వల్ల మరింత మందికి వ్యాధి సోకుతుంది. అయినా.. అధికారులు చర్యలు వేగవంతం చేయకపోవడం చూస్తుంచే.. ప్రజారోగ్యం పట్ల ప్రభుతానికున్న నిర్లక్ష్యం బట్టబయలవుతుంది.
కేసులున్నా.. పరీక్షా కేంద్రాల్లేవ్!
రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకంటే రాజధాని పరిధిలోని జిల్లాల్లో అధికంగా కరోనా విస్తరిస్తోందని ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. దీన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేయాలని రాజధాని జిల్లాల్లో 50 వేల కరోనా పరీక్షలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. అయితే అధికారులు ప్రణాళికతో ముందుకు వెళితే నగరంలో వైరస్ విస్తరణకు అడ్డుకట్ట పడేది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 వేలు, ఆపైన పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వారంరోజులుగా రోజుకు 600 నుంచి 700 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రాలకు నిత్యం వేలాదిమంది పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. కొంతమంది ప్రైవేటు పరీక్షల కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే కిట్స్ అయిపోయాయని, ఆరోజుకు చేయాల్సినవి పూర్తయిందనో కారణం చూపి పరీక్షలను ఆపేస్తున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చిన వందలాదిమంది వెనుతిరుగుతున్నారు. గాంధీతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పరీక్షల ల్యాబ్‌లు ఏరోజుకారోజు ఫలితాలను వెల్లడించలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా వైద్య శాఖ స్పందించి పరీక్షలు చేసే సౌకర్యాలున్న కేంద్రాలకు అనుమతిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు.