భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నెహ్రూనగర్‌కు చెందిన జిల్లేపల్లి స్టాలిన్‌కు ఆవిష్కరణలు అంటే ఇష్టం. పరిస్థితుల ప్రభావంతో ఆటోమొబైల్ రంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నాడు. 1996లో పాల్వంచలో సొంతంగా ఓ గ్యారేజీ ఏర్పాటు చేసుకున్నాడు. మెకానిక్‌గా మారినప్పటికీ ఏదో చేయాలన్న తపన స్టాలిన్‌ను వెంటాడుతూనే ఉంది.
రిక్షాలకు విద్యుత్ మోటార్లు
డీజిల్ మెకానిక్‌గా ఆయనకున్న మంచి పేరును మరింత ఇనుమడింప చేసుకోవాలని యోచించి తొలితరంలో వచ్చిన ఆటో ట్రాలీలకు ప్రత్యేకంగా సెల్ఫ్ డైనమోలు బిగించి అందరి మన్ననలు పొందాడు. దివ్యాంగుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాన్ని త్రిచక్ర వాహనంగా మార్చాడు. రిక్షాలనే నమ్ముకుని వాటిని తొక్కలేక జీవితాలను భారంగా వెళ్లదీస్తున్న వారి జీవన విధానం స్టాలిన్‌ను కలిచివేసింది. రిక్షాను తొక్కే భారం లేకుండా రిక్షాలకు విద్యుత్ మోటార్లను అమర్చడం మొదలు పెట్టాడు.