రాష్ట్రంలో మాంసం దుకాణాల ముందు జనాలు క్యూ కట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వెలవెలబోయిన దుకాణాలు ఆదివారం ఒక్కసారిగా కిక్కిరిసి కనిపించాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9.30కే మాంసం అందుబాటులో లేకుండా పోయింది. మటన్ ధర గతంలో ఎన్నడూ లేనంతగా కిలో రూ.800 అయ్యింది. బోన్‌లెస్ అయితే కిలో రూ.950 నుంచి రూ.1,000 పలికింది. మార్కెట్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.180, డ్రెస్‌డ్ రూ.155, లైవ్ రూ.105కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.200 వరకూ విక్రయించారు. గత ఆదివారం చికెన్ కోసం 12 మంది మాత్రమే వస్తే, ఈ వారం ఉదయం 10 గంటలలోపే సుమారు 40 మంది వచ్చారని ఉప్పల్‌లో ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతుండడం వల్ల డిమాండ్ అమాంతం పెరిగింది. కోడి గుడ్డు ధర గత వారం రూ.3 నుంచి 3.50 వరకూ ఉంటే ఇప్పుడు రూ.5కి పెరిగింది.
దొరకని చేపలు..
మార్కెట్లలో చేపలు అందుబాటులో లేకుండా పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేట ఊపందుకున్నా అవి నగరాల్లోకి రావడం లేదు. రవాణా వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో చేపల వినియోగం 70శాతం తగ్గింది. హైదరాబాద్‌లో కేవలం 10శాతం వినియోగం ఉంది. సాధారణంగా సెలవు రోజుల్లో హైదరాబాద్‌లో 300 నుంచి 400 క్వింటాళ్ల చేపల విక్రయాలుండాలి కానీ ప్రస్తుతం 30 నుంచి 40 క్వింటాళ్లే దొరకుతున్నాయని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.