Meals At Hospitals: రాష్ట్రం నలుమూలల నుంచి ఆరోగ్య సమస్యలతో రోగులు హైదరాబాద్ వస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు నిత్యం వేలాది మంది రోగులు వచ్చి చికిత్స పొందుతుంటారు. ఒక్కోసారి రోజులు, నెలల తరబడి ఆస్పత్రుల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందే రోగులకు సర్కారే ఉచితంగా ఆహారం అందిస్తుంది. కానీ రోగి సహాయకుల పరిస్థితే దయనీయంగా మారుతోంది. హోటల్‌ల నుంచి ఆహారం కొనలేక... ఆకలికి తాళలేక ఇబ్బందులు పడుతుంటారు. వారి అవస్థలు గమనించిన ప్రభుత్వం రోగి సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందించాలని నిర్ణయించింది. నేడు నగరవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎమ్‌ఎన్‌జె, నిలోఫర్, సరోజినీదేవి, పేట్ల బూర్జు ప్రసూతి ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు 5 రూపాయలకే భోజనం కార్యక్రమం ప్రారంభించనున్నారు. కోఠి జిల్లా ఆస్పత్రి, కోఠి ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, చెస్ట్, టిమ్స్, ఫీవర్ ఆస్పత్రులతోపాటు గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు లు 5 రూపాయల భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్‌తో టీఎస్ఎమ్ఐడీసీ ఒప్పందం కుదుర్చుకుంది.