Radio facility in RTC buses: తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలో ముందుకు వెళుతోంది. ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో రేడియో సదుపాయాన్ని కల్పించింది. ముందు ఫైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సుల్లో ఈ రేడియోను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు.
అనంతరం రేడియో పనితీరును ఆయన పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేస్తున్న విధానం, సౌండ్ తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్, కూకట్‌పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉప్పల్-సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదిపట్నం, సికింద్రాబాద్-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్‌చెరు, ఇబ్రహింపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. ఆయా బస్సుల్లో ఈ రోజు నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు.