ఎయిర్‌పోర్టుకు మెట్రో గరిష్ఠ వేగం 120కిమీ.. సమయం 26 నిమిషాలు.. - Airport Metro line in Hyderabad soon
survey on Hyderabad Airport Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మార్గాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీర్లు, సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి నార్సింగి జంక్షన్ వరకు ఇంజినీర్ల బృందం పరిశీలించింది. దాదాపు 10 కి.మీ పొడవునా కాలినడకన ఎండీ, ఇంజనీర్లు, సర్వే బృందాలు పరిశీలించాయి.
ఎయిర్‌పోర్టు మెట్రో
By
Published : Dec 18, 2022, 7:45 PM IST
survey on Hyderabad Airport Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకమౌతుందని ఆయన అన్నారు. మెట్రో స్టేషన్ల నిర్మాణం ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని సూచించారు.
ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ను నగర విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలని సూచించారు. ఇక్కడ నుండి ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేయాలని అన్నారు. స్టేషన్‌లకు సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, ఐకియా ముందు ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్, బ్లూ లైన్ కొత్త టెర్మినల్ నిర్మాణం జరపనున్నట్టు తెలిపారు.
ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో మొదటి స్టేషన్‌కి ప్రవేశం, నిష్క్రమణలు ప్లాన్ చేసేముందు, ఇక్కడకు దగ్గర్లోనే ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన అదనపు హై వోల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా విధంగా ఉండాలని సూచించారు. అలాగే మెట్రో మొదటి దశలో సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలని.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్‌కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించనున్న బీహెచ్ఇఎల్ - లక్డీ కాపుల్ మెట్రో కారిడార్‌కు ఇబ్బంది లేకుండా డిజైన్ ఉండాలని ఎండీ సూచించారు.
నార్సింగి, కోకాపేట ఇతర సమీప ప్రాంతాల్లో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆవల నుండి వచ్చే ప్రయాణీకుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్టంగా 120కిమీ వేగంతో వెళుతూ... 31 కిమీ దూరాన్ని 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్రో నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.