తెలంగాణలో వచ్చే రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్ సీట్లు (MBBS SEATS) అందుబాటులోకి రానున్నాయి. 2022-23 వైద్య విద్య సంవత్సరంలో 8.. 2023-24 వైద్య విద్య సంవత్సరంలో మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను (Government Medical Colleges) నెలకొల్పాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ఒక్కో వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున కొత్తగా రానున్నాయి.
2022-23 సంవత్సరానికి సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్, రామగుండం(సింగరేణి)లో.. మొత్తం 8 ప్రభుత్వ వైద్య కళాశాలలల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఈ నెల 23న జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission)కు వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తు చేయనుంది. ఒక్కో వైద్య కళాశాల (Medical College)కు అనుబంధంగా 330 పడకల ఆసుపత్రి తప్పనిసరి కావడంతో.. వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపుపై ఆరోగ్యశాఖ దృషి సారించింది.
ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో జాతీయ వైద్య కమిషన్ (Government Medical Colleges) నుంచి తనిఖీల బృందం వచ్చే అవకాశాలుండటంతో.. కొత్త కళాశాలల్లో తొలి ఏడాది తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 400 పడకలు ఉన్నాయి. మంచిర్యాలలో 200, మహబూబాబాద్‌లో 170, వనపర్తి, జగిత్యాల ఆసుపత్రుల్లో 150 చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 120, కొత్తగూడెంలో 100 పడకలు మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో నవంబరు 30 నాటికి అదనపు పడకల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం తాత్కాలిక భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తున్నాయి. వీటికితోడు 2023-24 సంవత్సరానికి వికారాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లోనూ నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు కోరనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా.. 2014 తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో కళాశాలలను సర్కారు నెలకొల్పింది. ఈ 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 1,640 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి: Covid-19 effect on children: కరోనా బాధితుల్లో ఐదేళ్లలోపు పిల్లలు ఎంతమందంటే..