ముందుగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వైద్యవిద్య తరగతులను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆరంభించి, అనంతరం తుది ఏడాది విద్యార్థులకు, అటు తర్వాత దశల వారీగా ఇతరులకు తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. అందుకు సన్నద్ధం కావాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలకు లేఖలు రాసింది. తరగతుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా మార్గదర్శకాలు జారీచేసింది.
2 నెలల కిందటే ఎన్‌ఎంసీ పచ్చజెండా
కొవిడ్ విజృంభణతో 2020లో వైద్యవిద్య తరగతుల నిర్వహణ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నా, ప్రాక్టికల్స్‌కు మాత్రం విద్యార్థులు దూరమయ్యారు. కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) డిసెంబరు 1 నుంచే తరగతులు ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. అయినా కర్ణాటక, గుజరాత్ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు మినహా ఎక్కడా తరగతులు ప్రారంభం కాలేదు. ఈ రాష్ట్రాల్లోనూ కేవలం తుది ఏడాది తరగతుల నిర్వహణకు మాత్రమే అనుమతించారు. 2020-21 వైద్యవిద్య సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీరికి ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతుల నిర్వహణకు ఎన్‌ఎంసీ అనుమతించింది. దీంతో రాష్ట్రంలోనూ వైద్యవిద్య తరగతులకు కాళోజీ ఆరోగ్య వర్సిటీ సమాయత్తమైంది. వైద్యకళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించింది. 9వ తరగతి నుంచి జూనియర్, డిగ్రీ, సాంకేతిక, వృత్తివిద్య కళాశాలలను వచ్చే నెల 1 నుంచి పునఃప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన క్రమంలో వైద్య కళాశాలల పునఃప్రారంభానికీ అనుమతులు వస్తాయని భావిస్తున్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ తదితర కోర్సుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి అన్ని సంవత్సరాల విద్యార్థులు సుమారు 55 వేలకు పైగానే ఉన్నట్టు సమాచారం.
మార్గదర్శకాలు ఇలా
- ఆర్‌టీపీసీఆర్ కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణయిన ధ్రువపత్రంతో విద్యార్థులు కళాశాలకు రావాల్సి ఉంటుంది.
- జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలుంటే అనుమతి నిరాకరిస్తారు.
- తమ అంగీకారంతోనే పిల్లలను కళాశాలకు పంపిస్తున్నట్లుగా తల్లిదండ్రులు అనుమతి పత్రాన్ని ఇవ్వాలి.
- తరగతి గదిలో ఒక బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చోవాలి.
- విద్యార్థుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.
- కచ్చితంగా మాస్క్ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో ఉపయోగించాలి.
ఇదీ చూడండి:సీరం టీకా 'కొవిషీల్డ్' ప్రత్యేకతలివే...