ఎన్నో మార్గాల్లో ఎంబీఏ.. ఆసక్తికి అనుగుణంగా స్పెషలైజేషన్లు!
రంగంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఎంచుకోవడానికి మొగ్గు చూపే కోర్సు ఎంబీఏ. సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకునేదీ ఈ మార్గమే! కెరియర్‌లో ఉన్నతి, అంతర్జాతీయ అనుభవం, మేనేజీరియల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి ప్రధాన నైపుణ్యాలను చేజిక్కించుకోవాలన్నా.. ఎక్కువమంది మొగ్గు చూపేది మేనేజ్‌మెంట్ కోర్సులవైపే! ఇలా ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన కోర్సుల్లో ఇదీ ఒకటి. అందుకే ఎన్నో సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎన్నో స్పెషలైజేషన్లే కాదు.. అభ్యర్థి అవసరాలకు తగ్గట్టుగా ఒక్క కోర్సే వివిధ రూపాల్లోనూ అందుబాటులో ఉంది. మీకు తగినదేదో తెలుసుకోండి మరి!
ఎంబీఏ కోర్సు లాభాలు, ఎంబీఏలో వివిధ కోర్సులు
By
Published : Apr 10, 2021, 11:15 AM IST
వీలునుబట్టి ఎంచుకునేలా ఎన్నో ఎంబీఏ మార్గాలు ఉన్నాయి. దేశంలో, విదేశంలో ఎక్కడ, ఏ సంస్థలో చదవాలనిభావించినా అవసరం, ఆసక్తులకు అనుగుణంగా ఓసారి పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం మేలు!
ప్రతి సంస్థలోనూ మేనేజ్‌మెంట్ తప్పనిసరి విభాగం. దీనికి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఎక్కువ. కాలానుగుణంగా పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఎన్నో స్పెషలైజేషన్లను జోడిస్తూ ఉద్యోగావకాశాలనూ అందిస్తోంది. చదివిన పాఠ్యాంశ విభాగాలతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారెవరైనా దీనిని ఎంచుకునే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న కెరియర్లలో ఇదీ ఒకటి. సంస్థ, వ్యాపారంతో సంబంధం లేకుండా ప్రతి రంగంలో మేనేజర్ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్.. ఇలా ప్రధాన విభాగాలన్నీ సంయుక్తంగా కలిసి పనిచేయడంలో వీరిదే ప్రధాన పాత్ర. తద్వారా సంస్థ తమ లక్ష్యాలను సరైన రీతిలో చేరుకునేలా చేస్తారు. వీరిని కార్పొరేట్ ప్రపంచంలో నిలదొక్కుకునేలా, వాటిని సక్రమంగా నడిపేలా తీర్చిదిద్దేవి మేనేజ్‌మెంట్ కోర్సులు.
వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారైనా, సంస్థ కార్యకలాపాలపై అవగాహన తెచ్చుకోవాలన్నా, పదోన్నతి కోసం చూసేవారు.. కారణమేదైనా ఏ రంగం వారైనా ఎక్కువమంది పీజీ స్థాయిలో మొగ్గు చూపుతున్న కోర్సు ఎంబీఏ. మేనేజీరియల్, అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి కీలక నైపుణ్యాల అభివృద్ధికీ దీన్ని ఆశ్రయించేవారున్నారు.
వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్న విషయం అందరికీ విదితమే. కానీ వీలునుబట్టి ఎంచుకునేలా కూడా ఎన్నో ఎంబీఏ మార్గాలున్నాయి. దేశంలో, విదేశంలో ఎక్కడ, ఏ సంస్థలో చదవాలనుకున్నా.. అవసరం, ఆసక్తికి అనుగుణంగా వీటిని ఓసారి పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరం.
ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్
సంప్రదాయ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల విషయంలో ఈ రెండు- ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్ అవకాశాలుంటాయి. సాధారణంగా వీటి కాలవ్యవధి రెండేళ్లు. విదేశీ విద్యాసంస్థల్లో ఏడాది వ్యవధిగలవీ (పార్ట్‌టైమ్‌వి) ఉన్నాయి. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నీ ఈ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
ఏదైనా మంచి కళాశాల/ విశ్వవిద్యాలయంలో ఫుల్‌టైం ఎంబీఏ ఎంచుకుంటే.. మంచి బోధనతోపాటు లోతైన శిక్షణ ఉంటుంది. విద్యార్థి పూర్తి సమయం చదువుకే కేటాయించాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తూ ఎంచుకుందామనుకునేవారికి ఇది అనుకూలం కాదు.
ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునేవారికి పార్ట్‌టైం ఎంబీఏ మంచి ప్రత్యామ్నాయం. తరగతులు సాయంత్రం సమయాల్లోనో వారాంతంలోనో నిర్వహిస్తారు. కానీ కోర్సు పూర్తిచేయడానికి కాస్త సమయం తీసుకునే అవకాశముంటుంది.
దూరవిద్యలో..
దీనిని అనువైన, అందరికీ అందుబాటులో ఉండే ఆప్షన్‌గా చెప్పొచ్చు. రోజువారీగా తరగతులకు తప్పక హాజరు కావాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే వారాంతాల్లో మాత్రం తప్పక తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. తద్వారా తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను నేరుగా కలిసే వీలుంటుంది. ఆలోచనలు పంచుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, విద్యాసంబంధ/ ఇతర అంశాలపై చర్చలకూ అవకాశం దొరకుతుంది.
వీటిలోనూ కొన్ని సంస్థలు రోజువారీ తరగతులను అభ్యర్థి అనుకూల సమయంలో చదువుకునేలా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ, వారాంతాల్లో క్యాంపస్‌కు హాజరయ్యేలా చూస్తున్నాయి. సంప్రదాయ పద్ధతిలో చదువుకునే వీలులేని విద్యార్థులు/ ప్రొఫెషనల్స్‌కి ఇది సరైన మార్గం. అభ్యసించడానికి అయ్యే ఖర్చూ తక్కువగానే ఉంటుంది. ఎంచుకున్న సంస్థ, కోర్సునుబట్టి కోర్సుల కాలవ్యవధుల్లో మార్పులున్నాయి. సాధారణంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల వ్యవధి వరకూ ఉంటాయి.
ఆన్‌లైన్ విధానంలో..
ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న విధానమిది. సంస్థలూ సంప్రదాయ ఎంబీఏతోపాటుగా దీనికీ సమాన ప్రాధాన్యమిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితి తరువాత ఇంకా ఆదరణ పెరిగింది. తాజా గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్స్ ఈ విధానంపై ఎక్కువ మొగ్గు చూపుతున్నవారిలో ఉన్నారు. సంస్థలూ నేరుగా క్యాంపస్‌కి వెళ్లి చదువుకోవడం కుదరని విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. వారాంతాల్లో సైతం క్యాంపస్‌కు వెళ్లడం కుదరదనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు.
నచ్చిన సమయంలో, మెచ్చిన ప్రదేశంలో, అతి తక్కువ ఖర్చుతో చదువుకునే వీలు వీటి ద్వారా దక్కుతుంది. దీని ద్వారా విద్యార్థిలో స్వతంత్రంగా నేర్చుకునే లక్షణాలు అభివృద్ధి చెందుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. అదనంగా సమయపాలన, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలూ అలవడతాయి.
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏను ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 5 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉండి, ఉన్నత స్థానాలు/ ప్రమోషన్ కోసం ప్రయత్నించే మిడిల్ మేనేజీరియల్ స్థాయి వారు దీనిని ఎంచుకోవచ్చు. కొన్ని ఐఐఎంలు, ఐఎస్‌బీ హైదరాబాద్ వంటి సంస్థలూ దీనిని అందిస్తున్నాయి. దేశంలో ఈ కోర్సులకు ప్రాముఖ్యం పెరుగుతోంది. కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి రెండేళ్లు. ఎంచుకున్న స్పెషలైజేషన్ బట్టి కాలవ్యవధి మారుతుంది. పార్ట్‌టైమ్ విధానంలో సాగుతుంది. సంస్థనుబట్టి ఎంపిక విధానాల్లో మార్పులున్నాయి. ప్రవేశ ప్రక్రియ మాత్రం మిగతా ఎంబీఏ కోర్సుల కంటే కఠినం.
సంయుక్తంగా..
రెండు భిన్న విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా జాయింట్ ఎంబీఏ కోర్సును అందిస్తాయి. విదేశాల్లో రెండు నుంచి అయిదు సంస్థలూ సంయుక్తంగా అందిస్తాయి. మన దేశంలో ఎక్కువగా రెండు విద్యాసంస్థలు కోర్సును అందించడం కనిపిస్తుంది. వీటిని డ్యూయల్ డిగ్రీలుగానూ పిలుస్తారు. ఎంబీఏ కోసం విద్యార్థి దరఖాస్తు చేసుకుంటే రెండు భిన్న విద్యాసంస్థల్లో కోర్సు పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా దేశీయ సంస్థలు విదేశీ విద్యాసంస్థలతో కలిసి ఈ విధానంలో కోర్సులను అందిస్తున్నాయి. అందుకే వీటిని డ్యూయల్ కంట్రీ ఎంబీఏగానూ పిలుస్తారు. ఒకే కరిక్యులమ్‌ను భిన్న విద్యాసంస్థల అధ్యాపకుల నుంచి నేర్చుకోవడంగా చెప్పొచ్చు.
వీటిలోనూ సంస్థలనుబట్టి తేడాలున్నాయి. కొన్నిసార్లు మొదటి ఏడాది దేశంలో విజయవంతంగా పూర్తిచేసుకుంటే రెండో ఏడాది దేశీయ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ విద్యాసంస్థలో అక్కడికి వెళ్లి పూర్తిచేయడమో, ఆన్‌లైన్‌లో పూర్తిచేయడమో ఉంటుంది. ఇంకొన్నిసార్లు విద్యాభ్యాసం ఇక్కడ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్, ఇంటర్న్‌షిప్ విదేశంలో చేయాల్సి ఉంటుంది. విదేశీవిద్య కలను తక్కువ మొత్తంలో నెరవేర్చుకోవాలనుకునేవారికి ఇది ఓ అవకాశం. ఒక్కోసారి రెండుకు మించిన సంస్థలు సంయుక్తంగానూ ఈ తరహా కోర్సులను అందిస్తుంటాయి.
ఏమేం గమనించుకోవాలి?
దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఎంబీఏ కోర్సులను అందిస్తున్నాయి. లక్ష్యాలకు తగ్గట్టుగా తగిన కోర్సును ఎంచుకోవడంతోపాటు కొన్ని ప్రధాన అంశాలనూ పరిశీలించుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
లక్ష్యానికి తగినదేనా?
కెరియర్ మార్పు, కెరియర్‌లో మెరుగుదల, అంతర్జాతీయ అనుభవం, మెరుగైన జీతం.. సాధారణంగా మేనేజ్‌మెంట్ విద్యను ఎంచుకునేవారి ప్రధాన లక్ష్యాలు. ఎంచుకునే విద్యాసంస్థ మీ లక్ష్యాలను చేరువ చేసేలా ఉండాలి. ఉదాహరణకు- హాస్పిటల్ మేనేజ్‌మెంట్ మీ లక్ష్యం అయితే.. సంబంధిత కోర్సును ప్రత్యేకంగా అందించే దానిపైనే దృష్టిపెట్టాలి. కాబట్టి, ప్రఖ్యాతులను బట్టో, తెలిసినవారున్నారనో కాకుండా లక్ష్యాల ఆధారంగా కళాశాల/ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలి. ఇందుకు ఇంటర్నెట్ సాయం తీసుకోవచ్చు.
గుర్తింపు
ఎంచుకున్న సంస్థకు యూజీసీ, ఏఐసీటీఈల గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి. అలాగే మేనేజ్‌మెంట్ విద్య ఎంబీఏ, పీజీడీఎం రూపాల్లో ఉంటుంది. ఏ సర్టిఫికెట్ మీకు లాభిస్తుందో కూడా చూసుకోవాలి.
అధ్యాపకులు, అనుభవం
అనువైన విద్యను ఎంచుకోవడమే కాదు.. సరైన వ్యక్తులు బోధించడమూ ప్రధానమే. అప్పుడే నేర్చుకునే దానికీ విలువ ఉంటుంది. కాబట్టి, ముందుగానే అధ్యాపకుల పూర్తి ప్రొఫైల్‌నూ గమనించుకోవాలి. కళాశాల వెబ్‌సైట్‌లో వారి వివరాలు ఉంటాయి. వాటిని పరిశీలించుకోవాలి. పూర్వ విద్యార్థులతో మాట్లాడినా అవగాహన వస్తుంది.