GHMC Mayor On BJP Corporators Attack: గ్రేటర్ భాజపా కార్పొరేటర్లు సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..? అని మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ సమావేశాలే జరగడం లేదనే భాజపా కార్పొరేటర్ల ఆరోపణలు సరికాదన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మార్గదర్శకాలకు(covid regulations) అనుగుణంగా గతంలోనే వర్చువల్‌గా సమావేశాలు జరిపామన్నారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు.
కనీస అవగాహన లేదు..
భాజపా కార్పొరేటర్లు చాలా మంది కొత్తవాళ్లే ఉన్నారని.. వాళ్లెవరికీ పాలన విధానంపై కనీస అవగాహన లేదని ఆరోపించారు. ఏ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎవరు వస్తారో కూడా తెలియదన్నారు. నిధులు ఉన్నాయా..? లేదా అనేది ముఖ్యం కాదన్న మేయర్.. పనులు అవుతున్నాయా..? లేదా..? అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. భాజపా కార్పొరేటర్ల ప్రవర్తనపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.
'భాజపా కార్పొరేటర్లకు ఒక్కటే చెబుతున్నాను. యాభై వేల మందికి ప్రతినిధులుగా ఉన్న మీరు... నిరసనలు తెలిపే ఎన్నో విధానాలు ఉన్నాయి. నిన్న ఇచ్చినట్లు నినాదాలు ఇస్తే సరే. కానీ ప్రాపర్టీ ధ్వంసం చేయడం సరికాదు. ఇది మేయర్ ప్రాపర్టీ కాదు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ అభివృద్ధి గురించి, సిటీ అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ... ఇలా ధ్వంసం చేయడం సరికాదు. మీరే ధ్వంసం చేసి.. మీరే విధ్వంసం సృష్టిస్తే... మీరు పబ్లిక్కు ఏం చెబుతున్నట్లు? గూండాయిజం నేర్పిస్తున్నారా?.. ఏదీ ఉన్నా సరే అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. అందరం కలిసి వాటిని పరిష్కరించుకోవాలి.'