Mayawati on BSP meeting Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలంగాణ భరోసా' సభకు ఆ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "బహుజన ధర్మం పాటిద్ధాం.. బహుజన రాజ్యం సాదిద్ధాం" నినాదంతో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. సభా వేదిక పైకి వచ్చిన మాయావతి ప్రజలకు అభివాదం చేసి బీఎస్పీ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడిన ఆమె.. యూపీలో నాలుగు సార్లు బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ పార్టీదేనని గుర్తు చేశారు. అప్పటి బీఎస్పీ సర్కారు పథకాలను తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ హామీని విస్మరించిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఎస్పీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని మాయావతి వెల్లడించారు.
"జ్యోతిబాపూలే, అంబేడ్కర్, నారాయణగురు చూపిన బాటలో పయనిద్దాం. కాన్షీరామ్ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీల కోసం అంబేడ్కర్ రిజర్వేషన్లు తెచ్చినా.. ఇంకా ఆ వర్గాల చెంతకు అభివృద్ధి చేరలేదు. అంబేడ్కర్ మాటలను అప్పటి ప్రధాని నెహ్రూ లక్ష్య పెట్టలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. కాంగ్రెస్ విధానాలపై బీఎస్పీకి నమ్మకం లేదు. బీఎస్సీ కేవలం ఎస్సీల కోసమే కాదు.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేసింది."-మాయావతి, బీఎస్పీ అధినేత్రి
RS Praveen in Hyderabad BSP meeting: బీజేపీ, బీఆర్ఎస్లు పార్టీలు రెండు తోడు దొంగలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అకాల వర్షాలు వస్తే సీఎం ప్రగతి భవన్ దాటలేదని మండిపడ్డారు. విజయ డెయిరీని నిర్వీర్యం చేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు తలుపులు తెరిచే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఏకం కావాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులు, కౌలు రైతుల కష్టాలు తొలగిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.