May day Celebrations: సీఎం కేసీఆర్ వల్ల కార్మికులు కష్టానికి తగిన ఫలితం పొందుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సమయానికి జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారని.. తెలంగాణ వచ్చాక ఇప్పుడు ఎక్కడ కూడా యూనియన్ల గొడవలు లేవని పేర్కొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మేడే సందర్భంగా మంత్రి మల్లారెడ్డి.. కార్మిక వస్త్రధారణలో ఉత్సవాలకు విచ్చేశారు.
"తెలంగాణ అంటే బంగారు గుట్ట. మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతాం. నేడు ఫ్యాక్టరీల యజమానులు గతంలో కార్మికులే. కార్మికుల శ్రమతోనే కంపెనీలు నడుస్తున్నాయి. 40 ఏళ్ల క్రితం నేను సైకిల్‌పై పాలు, పూలు అమ్మాను. ఇప్పుడు నా కళాశాలలు దేశంలోనే టాప్ 10 స్థానాల్లో ఉన్నాయి. నా కష్టార్జితంతోనే ఇన్ని కళాశాలలు, సంస్థలు స్థాపించా. మన ఊరు- మన బడి ద్వారా పిల్లల భవిష్యత్ మారబోతోంది. కార్మికుల పిల్లల కోసం సీఎం కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. విరామం లేకుండా కష్టపడుతున్నా గనుకే నేనీస్థాయిలో ఉన్నా. కార్మికులను అగ్రస్థానానికి తీసుకెళ్లే బాధ్యత నాదే." -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
రాష్టంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెరాస సర్కారు పనిచేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. సమైక్య పాలనలో దేశంలో కరవు పీడిత రాష్ట్రాలు అంటే తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు అని చెప్పేవారన్న శ్రీనివాస్ గౌడ్.. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్నిరాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పథకాలను కేంద్రం సైతం కాఫీకొడుతోందని పేర్కొన్నారు.
"మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంస్థలు తెలంగాణకు వస్తున్నాయి. ఎంతమంది వచ్చినా ఆదుకుంటున్నాం. నీటి పారుదల ప్రాజెక్టుల కారణంగా వ్యవసాయం పెరిగింది. తెలంగాణ వచ్చాక భూముల ధరలు పెరగడంతో నిర్మాణ రంగం ఊపందుకుంది. రాష్ట్రంలో ఉన్న వారికి చేతినిండా ఉపాధి దొరుకుతోంది. ఇతర రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో ఉంటే పనికి ఢోకా ఉండదు అనే స్థితికి మనం చేరుకున్నాం." -శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి