మ్యాట్రీమోనిలో పెట్టుబడులు పెడితే ఆకర్షనీయమైన వడ్డీ ఇస్తానంటూ ప్రకటనలు ఇచ్చి.. ఓ వ్యక్తి ఏకంగా రూ.15 కోట్లు కొల్లగొట్టాడు. హైదరాబాద్ టోలీచౌకీలో నివాసముండే షేక్ మహమూద్ మూడేళ్ల కిందట ఆల్ మదీనా మ్యారేజ్ బ్యూరో ప్రారంభించాడు. అనతి కాలంలోనే మ్యారేజ్ బ్యూరో ప్రాచుర్యం పొందగా.... ఆల్ సునత్ మ్యారేజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో వివాహ వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ప్రారంభించాడు. భారీగా ఆర్జించాడు.
అధిక వడ్డీలిస్తానని నమ్మించి రూ.15 కోట్లు కాజేశాడు...! - matrimony fraud
మ్యారెజ్ బ్యూరో నడుపుకునే ఓ వ్యక్తి... అధికంగా సంపాదించాలనే అత్యాశతో వక్ర మార్గంలో వెళ్లాడు. తన మ్యాట్రీమోనిలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి... మదుపరులను బుట్టలో వేసుకున్నాడు. కొంతకాలం వడ్డీలు చెల్లించి... ఇప్పుడు బోర్డు తిప్పేశాడు. ఏకంగా రూ.15 కోట్లు కొల్లగొట్టి పరారయ్యాడు.
మరిన్ని ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. తమ మ్యారేజ్ బ్యూరోలో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన లాభాలొస్తాయంటూ ప్రకటనలిచ్చాడు. లక్ష పెడితే నెలకు ఐదు వేలు లాభంతో పాటు ఏడాది తర్వాత అసలు తీసుకోవచ్చని నమ్మించాడు. కొన్ని నెలలు చెల్లించాడు. మదుపరులు భారీగా పెరిగారు. ఈ ఏడాది జనవరి వరకూ చెల్లించి ఆపేశాడు.
అనుమానం వచ్చిన మదుపరులు ఈ నెల 11న మ్యారేజ్ బ్యూరోలకు వెళ్లి చూడగా... తాళాలు వేసున్నాయి. మహమూద్ భార్యను ప్రశ్నించగా... సమాచారం ఇవ్వకపోవటం వల్ల బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయించారు. సయ్యద్ అహ్మద్ హుస్సేన్, సయ్యద్ జావెద్ సహా 9 మంది పెట్టుబడిదారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా... ఈ వ్యవహారం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.