మ్యాట్రిమొనీలో వివరాలు సేకరించి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ చందానగర్ నల్లగండ్లకు చెందిన ఓ మహిళా వైద్యురాలు రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమొనిలో నమోదు చేసుకున్నారు.
విపుల్ పేరుతో రిక్వెస్ట్..
వివరాలు సేకరించిన నిందితులు డాక్టర్ విపుల్ ప్రకాశ్ పేరుతో రిక్వెస్ట్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. యూకేలో ఉంటున్న విపుల్ ఖరీదైన వస్తువులు పంపించాడని... ఆ పార్సిళ్లకు పన్నుల పేరుతో ఒకసారి రూ. 7లక్షల 45వేలు.. మరోసారి రూ. 5లక్షలు ఖాతాకు జమ చేయించుకున్నారని పేర్కొన్నారు. మోసపోయానని గుర్తించిన మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు... నలుగురిని దిల్లీలో అరెస్టు చేశారు.