హైదరాబాద్‌లో మెట్రో రైలు(Hyderabad Metro Rail) నష్టాలు 2021-22లో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ భారీ నష్టాలను మూటకట్టుకుంది. ఆదాయ లోటు దాదాపు రూ.2 వేల కోట్లకు చేరింది. లాక్‌డౌన్ ఎత్తేసినా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. కొవిడ్ తొలివేవ్, రెండో వేవ్ మెట్రోని తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎంతో ఎల్‌అండ్‌టీ మెట్రో ఛైర్మన్, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ. మేర మెట్రో పరుగులు పెడుతోంది. 56 రైళ్లు నిత్యం వెయ్యి ట్రిప్పులు వేస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కార్యాలయాల వేళ మాత్రమే ప్రయాణికులు మెట్రోలో ఎక్కువగా కన్పిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయం నిర్వహణ ఖర్చులకు సరిపోతోంది. మెట్రో ఆపరేషన్స్, పరిపాలన ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు కలిపి రూ.300 కోట్ల వరకు అవుతాయి. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో ఇంతకంటే ఎక్కువే సమకూరుతోంది. గతేడాది కొవిడ్‌తో ఏడు నెలలు మాత్రమే మెట్రో సేవలు అందించినా.. ప్రయాణికుల నుంచి రూ.346 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ మెట్రోని ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.14,132 కోట్ల అంచనాతో చేపట్టింది. అనంతరం ప్రాజెక్ట్ వ్యయం రూ.19 వేల కోట్లకు పెరిగింది. ఇందులో రూ.1,200 కోట్ల వరకు మాల్స్‌కు చేసిన వ్యయం మినహాయిస్తే మిగతాది మెట్రోరైలు కారిడార్ల నిర్మాణానికి పట్టింది. ఇందులో కొంత ఈక్విటీ కాగా.. మిగతా మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల నుంచి రుణాలుగా పొందామని... ఏటా వీటికి వడ్డీ రూ.1,412 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఎల్‌అండ్‌టీ అధికారులు అంటున్నారు. ప్రయాణికులు లేక టిక్కెట్ల ఆదాయం పడిపోవడం, మాల్స్, రిటైల్స్ నుంచి ఆదాయం పడిపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ మెట్రోకి కేంద్రం సర్దుబాటు వ్యయం నిధి కింద రూ.1,458 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1,200 కోట్లకు పైగా మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగిలిన నిధులు విడుదల చేయాలని కోరింది. ప్రస్తుత ఇబ్బందుల దృష్ట్యా సర్దుబాటు వ్యయం మిగిలిన నిధులు కేంద్రం నుంచి వచ్చేలా చూడాలని... సీఎం కేసీఆర్ దృష్టికి మరోసారి ఎల్‌అండ్‌టీ అధికారులు తీసుకెళ్లారు. పాతబస్తీలో 5.5 కి.మీ. పనులు పూర్తిచేయకపోవడంతో కేంద్రం ఈ నిధుల జారీని నిలిపి వేసింది.
ఇదీ చూడండి:DGP : మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు