హైదరాబాద్‌లో పెళ్లిళ్ల సీజన్లో సుమారు తొమ్మిది వేల పెళ్లిళ్లు జరిగేవి. కరోనా రెండో దశ కారణంగా(Covid Effect) చాలామంది వేడుకలను వాయిదా వేసుకుంటే కొందరు మాత్రమే నిరాడంబరంగా చేసుకున్నారు. సుమారు 800 ఫంక్షన్ హాళ్లు వేడుకలు లేక వెలవెలబోతున్నాయి. ఇందులో కొన్ని కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలు(Isolation Centers)గా కూడా మారాయి. శుభ ముహూర్తాలున్నప్పుడు పెళ్లిళ్లే కాకుండా గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటివి కూడా పెద్దఎత్తున జరిగేవి. కానీ ఈ ఏడాది అంతా తారుమారైంది.
మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలున్నా రెండో వేవ్ విజృంభణతో చాలామంది భయపడిపోయారు. దీనికి తోడు ప్రభుత్వ ఆంక్షలు(Covid Rules) కూడా ఉండడంతో ఎవరూ వేడుకల జోలికిపోలేదు. దాదాపు 80 శాతం కార్యక్రమాలను వాయిదా వేశారు. మిగిలిన 20 శాతం కూడా అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య నిర్వహిస్తున్నారు.ఈ రంగంపై ఆధారపడ్డ వారి ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది.
రాష్ట్రంలో 30 వేల మంది పురోహితులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ద్వారా ఉపాధి పొందేవారు. ఇప్పుడు తొంభైశాతం మందికి ఉపాధి పూర్తిగా తగ్గిపోయిందంటూ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘం ఐకాస కన్వీనర్ డీవీఆర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అతిథులకు ప్లేట్లు, పండ్లు అందించే మహిళలు ఉపాధి లేక ఇళ్లలో పాచిపనులు చేసుకుంటున్నారు. బాయ్స్ ఊర్లలో వ్యవసాయ పనులు, నగరాల్లో కూరగాయలు అమ్ముకుంటున్నారు. 'ఏటా 200 వరకు పెళ్లిళ్లు, ఈవెంట్లకు సేవలు అందించేవాళ్లం. రూ.3 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు దాదాపు 90శాతం వ్యాపారం కుప్పకూలింది. జూన్, జులైకి ఒక్క బుకింగ్ కూడా కాలేదు’ అని నగరంలోని ప్రముఖ సప్లయింగ్ కంపెనీ అధినేత నందికొండ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇలా వివాహానికి సంబంధించిన ప్రతి రంగంపై కరోనా చూపిన ప్రభావం తీవ్రంగా ఉంది. మళ్లీ ఆ కళకళలు తిరిగి ఎప్పుడొస్తాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
‘ఈఏడాది ముహూర్తాలు బాగా ఉండడంతో ఆర్థికంగా బాగానే ఉంటుందనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెలాఖరు వరకు ముహూర్తాలు ఉన్నాయి. జులై 10 నుంచి ఆషాఢం మొదలవుతుంది. దీంతో శుభకార్యాలు ఆగిపోతాయి. ఇప్పటికే చాలా పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి.’
-జి.రాఘవేంద్ర శర్మ
ఆన్లైన్ సదస్సులతో
ఐటీ, ఫార్మా, బీపీఓ కంపెనీలు, కేంద్రప్రభుత్వ సంస్థలు, రియాల్టీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలరీత్యా వందలమందితో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేవి. ఇలాంటి సదస్సులకు సాంకేతికంగా, నిర్వహణపరంగా అవసరమైన ఏర్పాట్లు చేసేవారికి, భోజనాలు అందించేవారికి, ఏసీలు, లైటింగ్ అందించేవారికి ఉపాధి లభించేది. ఇప్పుడా కాన్ఫరెన్స్‌లు అన్నీ ఆన్లైన్ కావడంతో వీరి ఉపాధి ఘోరంగా దెబ్బతింది.