తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 10:30 PM IST

ETV Bharat / state

'ఉచిత బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు'

రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ విషయంలో రాజీపడొద్దని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంచి నాణ్యత కల్గిన బియ్యం అందజేయాలని కోరారు.

mareddy srinivas
'ఉచిత బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు'

బియ్యం రవాణాలో మరింత వేగం పెంపు కోసం సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు కడుపునిండా భోజనం అందించాలన్న ఉద్దేశంతో… కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్(CM KCR)… ఈ నెల 5 నుంచి చేపట్టనున్న ఉచిత బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా 4వ తేదీలోగా గోదాముల నుంచి ఛౌక ధరల దుకాణాలకు బియ్యం చేరవేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఉచిత బియ్యం పంపిణీపై ఆ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ సంయుక్త కమిషనర్ ఉషారాణి, ఉప కమిషనర్ పద్మజ, సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, పీడీఎస్‌ ఉప మేనేజర్ మంగమ్మ పాల్గొన్నారు.

ఆశించిన స్థాయిలో బియ్యం రవాణా జరగకపోవడం పట్ల ఛైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం రవాణాలో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి 15 కిలోల చొప్పున 4,03,911 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. 3వ తేదీ వరకు అన్ని రేషన్‌ షాపులకు చేరుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ఎంత ఆర్థిక భారమైన కూడా పేదలకు ఉచితంగా బియ్యం అందించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దృష్ట్యా… పేదలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు తీసుకురావద్దన్నారు. తక్షణమే గుత్తేదారులతో మాట్లాడి అదనపు వాహనాలు సమకూర్చుకుని రవాణా వేగవంతం చేయాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని చెప్పారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలను డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు.

ఉచిత బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులైన పేదలకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు… అన్ని ఛౌక ధరల దుకాణాలు తెరిచే ఉంటాయని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్‌ షాపుల వద్ద ఎక్కువ మొత్తం లబ్ధిదారులు గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందిస్తామని ఎవరూ ఎలాంటి అందోళన చెందకుండా క్రమ పద్ధతిలో వచ్చి రేషన్ బియ్యం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:RAINS: కష్టాల ఊబిలో కర్షకులు... తడిసిపోయిన ధాన్యం కుప్పలు

ABOUT THE AUTHOR

...view details