ఏపీలోని విశాఖ మన్యం కొయ్యూరు మండల పరిధిలో జరిగిన ఎదురుకాల్పులపై మావోయిస్టు పార్టీ (Maoist Party) స్పందించింది. పోలీసుల బలగాలు చేసిన ఆకస్మిక దాడిలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని వెల్లడించింది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (AOB) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గణేష్ (maoist ganesh) పేరిట ఓ లేఖ విడుదలైంది.
కాల్పుల్లో రణదేవ్ - ఒడిశా , అశోక్ - తెలంగాణ, సంతు - ఒడిశా, పాయికే- ఛతీస్‌గఢ్, లలిత - ఆంధ్రప్రదేశ్(విశాఖ), చైతే - ఛతీస్ఘడ్ చనిపోయినట్లు వెల్లడించారు. వీరి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్యంలో జరిగిన దాడి సీఎం జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలోనే జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేసినట్లు తెలిపారు. ఎన్ని దాడులు జరిగినా.. పీడిత ప్రజల ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు.
వేధింపులకు గురి చేస్తున్నారు: అధికార ప్రతినిధి గణేష్
సీఎం జగన్ తన స్వప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ (pm modi)ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ.. లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే పోలీసుస్వామ్యం అనే తెలుసు. ప్రజాస్వామిక సంస్థలకు చెందిన అనేక మందిని జైలు పాలు చేశారు. పత్రికా రంగం నుంచి ప్రతిపక్షాలను సైతం వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం సమైక్యంగా పోరాడాలి - అధికార ప్రతినిధి గణేష్
అసలేం జరిగిందంటే...
విశాఖ మన్యం బుధవారం ఉదయం తుపాకుల మోతలతో దద్దరిల్లింది. కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు అగ్రనేతలు తప్పించుకున్నట్లు పోలీసులు అదే రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి:WTC Final: తొలి రోజు ఆట వర్షార్పణం