Home Schooling : తెల్లవారి లేచిందే మొదలు పిల్లలను బడికి పంపేందుకు పెద్దలు ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. పిల్లలు సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టి.. అలసిసొలసి ఇల్లు చేరతారు. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్లు మొదలవుతాయి. ఆసక్తి ఉన్నా లేకున్నా.. అందరికీ ఒకటే సబ్జెక్టులు. ఈ క్రమంలో పలువుర్ని ఆకర్షిస్తోంది హోంస్కూలింగ్. ఇప్పటికే విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానం పట్ల హైదరాబాద్ నగరంలోనూ ఆసక్తి కనిపిస్తోంది.
ఇంట్లో ఉండే చదువు పూర్తి చేసే ఈ విధానంలో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయడం ద్వారా ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌సీ బోర్డులకు సమానంగా గుర్తిస్తారు. ఏటా పరీక్షలు రాయాల్సిన పనీ ఉండదు. బోర్డు పరీక్షలు రాస్తే సరిపోతుంది. అమెరికాలో పెద్దసంఖ్యలో పిల్లలు ఈ విధానంలో చదువుతున్నారు. మన దగ్గర దిల్లీ, కొచ్చిలో ఎక్కువగా ఉన్నారు.
ఏంటీ విధానం?:సాధారణంగా పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరి విద్యాభ్యాసం పూర్తిచేస్తుంటారు. హోంస్కూలింగ్‌లో పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే చదువుకుంటారు. తల్లిదండ్రులే చదివించుకుంటారు. ఎనిమిదో తరగతి పాసైన విద్యార్థులు ఓపెన్ స్కూలింగ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.10 లక్షల మంది ఈ విధానంలో ప్రవేశాలు పొందారు. కొవిడ్ అనుభవాలు కూడా హోంస్కూలింగ్ పెరగడానికి దోహదం చేశాయి. అయితే, దీంతో సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయేమోననే ఆందోళనను కొందరు వెలిబుచ్చారు.
నచ్చిన సబ్జెక్టులను చదువుతున్నా: నేను ఆరోతరగతి వరకు పాఠశాలలో చదివా. కొవిడ్‌తో రెండేళ్లపాటు ఆన్‌లైన్ తరగతులే. ఆ తర్వాత హోంస్కూలింగ్ చేస్తున్నా. పాఠశాలలో రోజంతా చదువుతోనే సరిపోతుంది. హోంస్కూలింగ్‌లో సమయం మన చేతుల్లో ఉంటుంది. ఉదయం తరగతి పాఠాలు చదువుకుంటాను. నాకు ఇష్టమైన రచనలకు కొంత సమయం కేటాయిస్తాను. మూడు పుస్తకాలు రాశాను. తైక్వాండో నేర్చుకుంటున్నా. అన్నింటికి మించి నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం ఇందులో ఉంది. 8వ గ్రేడ్, 10వ గ్రేడ్, 12వ గ్రేడ్‌కు పరీక్షలు ఉంటాయి. బాగా రాయగలం అన్నప్పుడు పరీక్ష రాయవచ్చు. ఆన్‌డిమాండ్ పరీక్షకూ హాజరు కావొచ్చు.- వైష్ణవి, పదో తరగతి, హోంస్కూలింగ్