కొవిడ్ బారినపడుతున్న వారిలో దాదాపు 94 శాతంమంది ఇళ్లలో ఉండే మందులు వాడి కోలుకుంటున్నారు. 6 శాతంమందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌హెచ్‌ఎఫ్) సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 400 మంది, గ్రేటర్ హైదరాబాద్‌లో 1,520 మంది కొవిడ్ రోగులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వారితో ఫోన్లో మాట్లాడి సేకరించి క్రోడీకరించిన సమాచారాన్ని ఆ సంస్థ ప్రతినిధులు గురువారం వెల్లడించారు.
94% మంది ఆసుపత్రికి వెళ్లకుండానే కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు - ఆసుపతత్రి సాయం లేకుండానే కొవిడ్ నుంచి కోలుకుంటున్న రోగులు
రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారిలో కేవలం 6 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతోందని.. మిగిలిన 94 శాతం మంది ఇళ్లలో ఉంటూ.. తగిన నిబంధనలు పాటిస్తూ మందులు వాడి కోలుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఓ సర్వేలో వెల్లడించింది.
![94% మంది ఆసుపత్రికి వెళ్లకుండానే కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు telangana corona patients cured without help of hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8842592-393-8842592-1600394447565.jpg)
పాజిటివ్‌గా తేలిన తర్వాత బాధితులకు ప్రభుత్వం తరఫున ఔషధాల కిట్ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఔషధాలనే తీసుకుంటూ వ్యాధి నుంచి ఉపశమనం పొందుతున్నామని రోగులు తెలిపారు. తాము సంప్రదించిన 1,920 మంది రోగుల్లో నలుగురే పరిస్థితి విషమించడంతో మృతి చెందారని హెచ్‌హెచ్‌ఎఫ్ అధ్యక్షులు ముజ్‌తాబ హసన్ అక్సారీ వెల్లడించారు. గతంలో చాలామందికి ఆక్సిజన్ అవసరమయ్యేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి బాగా తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్ లక్షణాలను ముందే గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం లేకుండా దాన్నుంచి బయటపడవచ్చని తెలిపారు.
ఇదీ చదవండిఃకరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు