మూడ్రోజులుగా వరదలో ఉన్న ఉప్పుగూడ, శివాజీనగర్, ఛత్రినాక, జంగంమెట్ ప్రాంతాలకు బాలాపూర్ చెరువు గండి కొట్టడంతో మళ్లీ ప్రవాహం పోటెత్తింది. అధికారులు భోజనం అందిస్తామని చెప్పి ఫోన్ కట్టేశారని స్థానికులు తెలిపారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ప్రాంతాల్లోనూ బాధితులకు సాయం దక్కలేదు. మూసీ పరిసర ప్రాంతాలైన ఓల్డ్ మలక్‌పేటలోని శంకర్‌నగర్, మూసానగర్, కమలానగర్, వినాయక్‌నగర్, అఫ్జల్‌నగర్, పద్మానగర్‌లో బురద నిలిచిపోయింది. బాధితులను పట్టించుకోరా అంటూ స్థానిక ఎమ్మెల్యే బలాల గురువారం జీహెచ్‌ఎంసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా కాలనీలకు రెండ్రోజులుగా విద్యుత్తు లేదు. ఉప్పల్ రామంతాపూర్ చెరువు వెనుక ఉన్న కాలనీలు, నల్ల చెరువు సమీప కావేరినగర్, శ్రీగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, న్యూభరత్‌నగర్, సౌత్‌స్వరూప్‌నగర్, మల్లికార్జుననగర్, ధర్మపురికాలనీల్లోనూ అదే పరిస్థితి. కాటేదాన్ సమీప అలీనగర్‌లోని వెయ్యి ఇళ్లను జల్‌పల్లి పెద్దచెరువు, పల్లెచెరువు నీరు ముంచేసింది. 10 అడుగుల మేర నీరు చేరడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇప్పటికే 2,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. మిగిలిన వారు మొదటి అంతస్తులోని ఇళ్లలోనో, డాబాలపైనో ఉంటున్నారు. ఈ ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రాలేదని స్థానికులు వాపోతున్నారు.
తాగునీరు దొరక్క ఇబ్బంది
నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని లక్ష్మీబాగ్ కాలనీలో మోకాల్లోతు ప్రవాహం ఉంది. అధికారులు రెండు పూటలా భోజనం సరఫరా చేశారని, బయటకు వెళ్లి తాగునీరు తెచ్చుకోలేకపోతున్నామని స్థానికులు తెలిపారు. మల్లేపల్లి మాన్‌గార్ బస్తీ, అఫ్జల్‌సాగర్ కాలనీలో ఇళ్లు ఇప్పటికీ వరదనీటిలోనే మునిగి ఉన్నాయి. మెహిదీపట్నం సర్కిల్ వ్యాప్తంగా కూలిన చెట్లను తొలగించే ప్రక్రియ పూర్తికాలేదు.
ఇళ్లు.. వ్యర్థాల గూళ్లు