హైదరాబాద్ శివారు మీర్‌పేట్ పరిధిలోని చెరువులకు వరద ఉద్ధృతి పెరిగింది. పెద్దచెరువు, మంత్రాల, సందె చెరువులు నిండుకుండలా మారి అలుగులు పారి... పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. బలహీనంగా ఉన్న మీర్‌పేట్ చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడంతో.... అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జలమయమైన మిథిలానగర్
వరద తాకిడికి మీర్‌పేట్ పరిధిలోని మిథిలానగర్ జలమయమైంది. మంత్రాలయం చెరువు నిండి దిగువకు భారీగా ప్రవాహం ఉండడంతో కాలనీ నీటమునిగింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతి ధాటికి ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. వెనక భాగం నుంచి వస్తున్న నీళ్లు... ఇంట్లో కెళ్లి బయటకు పొంగి పొర్లుతోంది. ఇంట్లో నడుములోతు నీళ్లు చేరడంతో... బియ్యం, సరుకులు, సామగ్రి, పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. మరికొన్ని వస్తువులు బయటికి కొట్టుకుపోయాయి. ముంపు భయంతో సొంతింటిని వదిలి వెళ్లాల్సి వస్తోందంటూ బాధితులు కంటతడిపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.