Many changes in telangana Congress Senior Leaders: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పెద్ద రచ్చనే రాజేసింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ... బహిరంగంగా విమర్శలు చేయడంతోపాటు, రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు ఎక్కుపెట్టి లేఖలు సైతం రాశారు. ఆయనకు పీసీసీ ఇవ్వొద్దని ఖరాఖండిగా చెప్పారు. కానీ అధిష్ఠానం వీరందరి అభ్యంతరాలను పక్కన పెట్టి... పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ రెడ్డికి(TPCC revanth reddy) కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా సీనియర్లు కొందరు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' సభలకు, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై నిర్వహించిన 'జంగ్ సైరన్' సభలకు సైతం సీనియర్లు కొందరు డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన పార్టీ హైకమాండ్... పార్టీ సీనియర్లను కొందరిని దిల్లీకి పిలిపించుకొని సుదీర్ఘంగా చర్చించింది. నేతలందరితో ఉమ్మడిగా మాట్లాడడంతో పాటు విడివిడిగా కూడా నాయకుల అభిప్రాయాలను సేకరించింది.
దిల్లీ నేతల హెచ్చరికలు!
telangana congress party: అధిష్ఠానం గీత దాటి బహిరంగంగా మీడియాతో మాట్లాడే నాయకులను... పార్టీలో అంతర్గతంగా సమస్యలను సృష్టించే నాయకులకు దిల్లీ పెద్దలు గట్టి వార్నింగ్ ఇచ్చారని సమాచారం. నాయకులు విబేధాలన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయకపోతే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దిల్లీ నేతల సందేశాలతో రాష్ట్రానికి వచ్చిన సీనియర్లలో క్రమంగా మార్పులు కనిపిస్తున్నాయి.