రక్షణరంగ పరిశోధనలు, ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మరో ముందడుగు పడింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ తయారీలో ముఖ్యమైన మధ్యభాగం (సెంటర్ ఫ్యూజ్‌లేజ్)ను హైదరాబాద్‌లోని వెమ్ టెక్నాలజీస్ సంస్థ విజయవంతంగా రూపొందించింది. యుద్ధవిమానానికి వెన్నెముక లాంటి మధ్యభాగాన్ని ఇక్కడ తయారు చేయడం ఏరోస్పేస్ రంగంలో కీలకమైన మైలురాయిగా రక్షణ పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. విమానంలో మధ్యభాగం అత్యంత కీలకం.
దీని కింద ల్యాండింగ్ గేర్లు, క్షిపణులను మోసుకెళ్లే ఆయుధ వ్యవస్థ, ఇంధన ట్యాంకు ఉంటాయి. సుమారు 650 కిలోల బరువుంటుంది. వెమ్ టెక్నాలజీస్ వేర్వేరు సంస్థలతో పోటీ పడి దీని తయారీకి అవకాశం పొందింది. ఆకాశ్ క్షిపణికి సెక్షన్-3, సుఖోయ్ యుద్ధవిమానం రాడార్లకు అవసరమైన వ్యవస్థలు, ఐఆర్ సీకర్స్, సర్వేలెన్స్ తయారు చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. నాణ్యత పరీక్షలు పూర్తవడంతో సెంటర్ ఫ్యూజ్‌లేజ్‌ను ఈ నెల 26న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు అందజేయనున్నారు.