Manik Rao Thackeray fires on CM KCR : తెలంగాణ సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పలు గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడానికి అక్కడి మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రజల సంపదను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా చందన పల్లి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ, ఈడీ, ఐటీ పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయని పలుమార్లు మాట్లాడిన మోదీ, అమిత్‌షాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి కారణం బీజేపీ, బీఆర్ఎస్లు రహస్య స్నేహితులు కావడమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
- Bhatti Vikramarka on KCR : 'బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే'
- Bandi Sanjay Fires on CM KCR : 'కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది సీఎం కేసీఆరే'
ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి వెనక్కి గుంజుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటిని ప్రభుత్వ పెద్దలకు కట్టబెడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఉపయోగ పడుతోందని ఎద్దేవా చేశారు. చిన్న, సన్నకారు రైతులకు కలిగే ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెవెన్యూ సంపద అందరికీ పంచాలి కానీ.. కొంతమంది సంపన్నులకే దక్కుతున్నదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.