Manikkam Tagore on Munugode Bypoll: మునుగోడు నియోజవర్గంలో ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున175 ప్రాంతాల్లో నిర్వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గాంధీ కుటుంబాల త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. "మన మునుగోడు మన కాంగ్రెస్" నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లి విజయం దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ గ్రామ సమన్వయకర్తల సమావేశంలో మాణిక్కం ఠాగూర్ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్లో రావచ్చని భావిస్తున్నట్లు ఠాగూర్ తెలిపారు. వంద రోజుల మిషన్తో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. గుజరాత్ ఎన్నికలతోపాటు మునుగోడు ఉపఎన్నిక కూడా వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలన్నారు. సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని.. అక్టోబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. రాబోయే వంద రోజులు చాలా కీలకమని ప్రతి ఒక్కరూ శక్తిమేర పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఠాగూర్ ఖండించారు.
రేవంత్రెడ్డి చేసిన హోంగార్డ్ వ్యాఖ్యలు ముగిసిన చాప్టర్ అని మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. భాజపాలో చేరిన నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై తానేమి మాట్లాడనన్నారు. మర్రి శశిధర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదని.. ప్రియాంక గాంధీ తెలంగాణాకు వస్తానంటే స్వాగతం చెబుతామన్నారు. తెలంగాణ నుంచి పోటీచేయాలని రాహుల్, ప్రియాంకలను ఆహ్వానిస్తే వాళ్లు ఆలోచిస్తారని.. కాంగ్రెస్లో చేరికలన్నింటిని ప్రియాంకా గాంధీ పర్యవేక్షిస్తున్నారని మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.