Congress Meeting Is Over: హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. అందుకోసం కమిటీలను వెంటనే పూర్తి చేయాలని పీసీసీ నేతలను ఆదేశించారు. గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జోడో అభియాన్ యాత్ర మంచి అవకాశంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెండు నెలలపాటు యాత్రను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికీ చేర్చేందుకు యాత్రను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ నెల 20న మళ్లీ వస్తానన్న ఠాక్రే రాష్ట్ర నేతలతో మరోసారి మాట్లాడుతానని తెలిపారు.
రెండు రోజుల పర్యటనలో మాణిక్‌రావు ఠాక్రే.. క్షణం తీరికలేకుండా గడిపారు. నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అధిక సమయం కేటాయించారు. మొదటిరోజు ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు 24 మంది నాయకులతో విడివిడిగా సమావేశం అయ్యారు. నాయకులు చెప్పే ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. ఎక్కువ మంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్లను కలుపుకుని వెళ్లడంలేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సమావేశంలో ఏకరవు పెట్టారు.
ఇదే సమయంలో జోక్యం చేసుకున్న రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే , మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పార్టీపరంగా నాయకులందరినీ కలుపుకొని పోవాలని స్పష్టం చేశారు. జీవితాన్ని పార్టీ కోసం ఫణంగా పెట్టిన నాయకులకు గౌరవం ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. రెండో రోజు ఉదయం ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న ఠాక్రే.. సమస్యలు తనకు వదిలేయాలని.. ఎన్నికలపై దృష్టి పెట్టాలని నాయకులకు సూచించారు. పార్టీ బలంగా ఉంది.. నేతల ఆలోచనే బలహీనంగా ఉందని వ్యాఖ్యానించిన ఠాక్రే.. ధైర్యంగా ముందుకు వెల్లేందుకు సంసిద్ధం కావాలని ఆదేశించారు. ఠాక్రే రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీ వెళ్లారు.