స్థానికంగా మామిడిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌తో చిల్లర అమ్మకాలు లేక కొనలేమని ఉత్తరాది మార్కెట్లు సైతం చేతులెత్తేశాయి. ఒకవైపు కూలీల కొరత వేధిస్తోంది. మరోవైపు అకాల వర్షాలపై రైతుల్లో గుబులు పట్టుకుంది. ఎంతో కొంత ధరకు కొనేవాళ్లుంటే చాలనుకుంటున్న పరిస్థితుల్లో మామిడికాయలు కొనేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ముందుకొచ్చింది. ఇప్పటికే వారం రోజుల్లో 15 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. నాణ్యతను బట్టి కిలోకు రూ. 20 నుంచి రూ.35 వరకు ధర చెల్లించింది. తాజాగా రాష్ట్రంలో మామిడికాయల లభ్యత ఉన్న 13 జిల్లాల నుంచి కొనుగోలుకు సిద్ధమైంది.
ఇంటి వద్దకే సరఫరా
రైతుల నుంచి సేకరించిన మామిడికాయలను సెర్ప్ ఆధ్వర్యంలో ‘బెనిషాన్’ బ్రాండు పేరుతో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కాయలను సహజసిద్ధంగా పండ్లుగా మార్చి, మార్కెటింగ్ శాఖ సహకారంతో సంచార రైతుబజార్‌ల ద్వారా ఇంటి ముందుకే తీసుకురానున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లకు బల్క్‌గా సరఫరా చేయనున్నారు. పరిమాణం, నాణ్యతను బట్టి కిలోకు రూ.80, రూ.50 చొప్పున విక్రయించనున్నారు.