తెలంగాణ

telangana

ETV Bharat / state

Mango farmers: మధుర ఫలం.. తగ్గిన దిగుబడి, ధరలతో భారీ నష్టాలు - మామిడి రైతులు

Mango farmers: మామిడి రైతులకు ఈ ఏడాది పీడకలగా మారనుంది. తగ్గిన దిగుబడి, ధరలతో రైతన్నకు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. మూలిగే నక్కమీద తాడిచెట్టు పడ్డట్లు అన్నచందంగా మామిడి రైతు పరిస్థితి తయారైంది. అసలే పంట దిగుబడి అంతంతమాత్రంగా ఉండటంతో మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. అయినా ధర అమాంతం పడిపోతుండటంతో రైతులు నష్టాలతో ఆందోళన చెందుతున్నారు.

Mango farmers
తగ్గిన దిగుబడి, ధరలతో భారీ నష్టాలు

By

Published : May 14, 2022, 5:01 AM IST

Mango farmers: వ్యాపారులు సిండికేట్‌గా మారడం.. దళారుల మాయాజాలం.. అకాల వర్షాలు.. వెరసి ఈ సారి ‘మధుర ఫలం’ రైతులకు చేదు అనుభవాల్ని మిగుల్చుతోంది. గత పది రోజుల్లో (ఈ నెల 3 నుంచి 13 వరకు) మామిడి టోకు ధర టన్నుకు రూ.లక్షా 15 వేల నుంచి రూ.62 వేలకు పడిపోయింది. అసలే పంట దిగుబడి అంతంతమాత్రంగా ఉండటంతో మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. అయినా ధర అమాంతం పడిపోతుండటంతో రైతులు నష్టాలతో ఆందోళన చెందుతున్నారు. గతేడాది(2021) ఏప్రిల్‌, మే(13వ తేదీ వరకు)లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల టన్నుల పంట తక్కువగా వచ్చిందని మార్కెటింగ్‌ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌ శివారు బాటసింగారంలోని అతి పెద్ద పండ్ల మార్కెట్‌కు 2021 ఏప్రిల్‌ 1 నుంచి మే 13 వరకూ 5.65 లక్షల క్వింటాళ్ల మామిడికాయలను రైతులు అమ్మకానికి తేగా ఈ ఏడాది అదే కాలవ్యవధిలో 3.98 లక్షల క్వింటాళ్లే అమ్మకానికి వచ్చాయి.ఇంకా జగిత్యాల, వరంగల్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో పంట దిగుబడి, మార్కెట్లకు రాక చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకుపైగా మామిడి తోటలున్నాయి. సాధారణంగా 7 లక్షల టన్నుల వరకూ దిగుబడి రావాలి. కానీ, ఈ సీజన్‌లో 4 లక్షల టన్నులకు మించి వచ్చే అవకాశం లేదని ఉద్యానశాఖ తెలిపింది.

దిల్లీ మార్కెట్లలో డిమాండును బట్టి తెలంగాణ మార్కెట్లలో రైతులకు ధరను వ్యాపారులు పెంచడం లేదా తగ్గించడం చేస్తారని మార్కెటింగ్‌ శాఖ బాటసింగారం పండ్ల మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి నర్సింహారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచీ దిల్లీ మార్కెట్లకు రోజూ భారీగా మామిడికాయలు వెళ్తున్నందున తెలంగాణలో ధర పడిపోయిన మాట వాస్తవమేనన్నారు.

ABOUT THE AUTHOR

...view details