Cyclone Mandous Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మాండూస్..ఈ ఉదయం నుంచి క్రమంగా బలహీనపడనుందని ఐఏండీ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న తుపాను.. శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో రెండురోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలినచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు.