Manda Krishna Madiga Speech Today : ఎస్సీలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మందకృష్ణ మాదిగ(Manda Krishna MRPS) ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఉపకులాల సభకు వచ్చిన ప్రధాని మోదీకి(PM Modi) ధన్యవాదాలు తెలిపారు. విశ్వరూప సభకు ప్రధాని మోదీ వస్తారని ఊహించలేదన్నారు. సమాజంలో మాదిగలని మనుషులుగా చూడలేదని.. పశువుల కంటే హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్యపరుస్తున్నామన్నారు. తమకు అండగా ఉండేందుకు వచ్చిన మోదీకి.. మొత్తం మాదిగలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు.
కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగను ఓదార్చిన ప్రధాని మోదీ
Viswaroopa Sabha Today in Parade grounds : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS).. కేవలం మాటలే చెబుతున్నాయని మండిపడ్డారు. తమ ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపేనని స్పష్టం చేశారు. బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ.. కమలం పార్టేనన్నారు. తెలంగాణకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా చేస్తామని ప్రకటించింది ఒక్క బీజేపేనన్నారు. ప్రధాని మోదీకి సామాజిక స్పృహ ఉంది కనుకే ఈ సభకు వచ్చారని.. బలహీనవర్గాల కష్టాలు ప్రధాని మోదీకి బాగా తెలుసని పేర్కొన్నారు.
దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులు చేసిన ఘనతప్రధాని మోదీదేనని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇచ్చినమాటను నిలబెట్టుకునే నేత.. ప్రధాని మోదీ అని వెల్లడించారు. బలహీనవర్గాల నుంచి వచ్చారు కనుకే మోదీకి తమ కష్టాలు తెలుసన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరని పేర్కొన్నారు. తక్కువ జనాభా ఉన్న కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారని ఆక్షేపించారు.
Manda Krishna Madiga on SC Classification :కర్ణాటక నుంచి నారాయణస్వామిని కేంద్రమంత్రిని చేసిన ఘనత మోదీదేనని హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల కష్టాలు తొలగించేందుకే ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని నిజంగా అమలుచేస్తున్నది బీజేపీ మాత్రమేనన్నారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ కట్టుకథలు చెబుతున్నాయని మండిపడ్డారు.
ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అనేక కమిషన్లు.. తమ నివేదికలో పేర్కొన్నాయన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలకు అంత్యోదయ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని మందకృష్ణ మాదిగ మోదీని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కూడా అనేకమంది వచ్చారన్నారు.
ప్రధాని మోదీ గుండె గట్టిదని.. మనసు మాత్రం వెన్నపూస అని మందకృష్ణ మాదిగ అన్నారు. మోదీని మించిన నాయకుడు లేరని.. భవిష్యత్తులో రారన్నారు. మోదీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎన్నికల్లో ఓడిన మురుగన్‌ను కేంద్రమంత్రి చేశారని.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత మోదీదేనన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఊరించిన మహిళా బిల్లును మోదీ తెచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే పార్టీలకు అతీతంగా మోదీకి అండగా ఉంటామన్నారు.
"ఎస్సీలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్, బీఆర్ఎస్.. మాటలే చెబుతున్నాయి. మా ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీ మాత్రమే. ప్రధాని బలహీన వర్గాల మనిషి అందుకే ఇక్కడికి వచ్చారు". - మందకృష్ణ మాదిగ
'బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ విరోధులు - మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా'