ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. దిల్లీ తాల్కతోరా స్టేడియంలో జరిగిన మాదిగ విద్యార్థి జాతీయ మహాసభలో ఆయన పాల్గొన్నారు. రాజకీయపరంగా అనేక అవరోధాలు సృష్టించినా 27 ఏళ్లుగా ఉద్యమం కొనసాగిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు. ఈ సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదని విమర్శించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, భాజపా నేత రావెల కిషోర్ బాబు, తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సహా ఇతర పార్టీలు, కుల సంఘాల నేతలు... వర్గీకరణకు అనుకూలంగా గళమెత్తారు.