Rush At Toll Plaza: తెలుగు వారు చేసుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెల్లవారుజామున పల్లె ఆడపడుచులు మేలుకొని వాకిళ్లలో ముత్యాల ముగ్గులేసి మురిసిపోయే పండుగ. అంతేకాకుండా కోడి పందాలతో కోలాహలంగా జరిగే పండుగ సంక్రాంతి. ఇలాంటి పర్వదినానికి ఎవరైనా ఎక్కడున్నా స్వస్థలాలకు చేరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలతో టోల్‌ప్లాజాల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు.
పండగ పురస్కరించుకొని భాగ్యనగరం నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చేవారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. వాహనాలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా టోల్ ప్లాజా వద్ద అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. వాహనాలకు ఫాస్ట్ టాగ్ లేకుంటే డబ్బులు తీసుకొని త్వరగా రసీదు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని కీసర టోల్ ప్లాజా మేనేజర్ మాదల జయప్రకాష్ తెలిపారు.