తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడ్‌గావ్‌ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..

రుణ యాప్‌ల ముసుగులో సాగించిన దోపిడీలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దిల్లీ, హైదరాబాద్‌లలో 11 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, బేగంపేట్‌లలో మూడు కాల్‌సెంటర్ల ద్వారా రుణ యాప్‌లను నిర్వహిస్తున్న కీలక సూత్రదారి మధును దిల్లీలో పట్టుకొన్నారు.

గుడ్‌గావ్‌ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..
గుడ్‌గావ్‌ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..

By

Published : Dec 24, 2020, 11:00 AM IST

సూక్ష్మరుణ సంస్థలు(మైక్రో ఫైనాన్స్‌) రుణ యాప్‌ల ముసుగులో సాగించిన దోపిడీలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. సాధారణంగా రుణాలు ఇచ్చేందుకు నెలకొల్పే సంస్థలు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి తీసుకోవాలి. లేని పక్షంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకోవాలి. రుణ యాప్‌లేవీ ఇలా చేయలేదు. ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్న మరో సంస్థకు అవసరమైన సేవలు అందిస్తామని చెబుతూ మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నాయి.

చట్ట విరుద్ధం...

ఆ ప్రకారం ఈ యాప్‌లు వాస్తవానికి రుణాలివ్వకూడదు. అయినా వ్యాపారంలోకి దిగిపోవడం చట్ట విరుద్ధమే. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దిల్లీ, హైదరాబాద్‌లలో 11 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, బేగంపేట్‌లలో మూడు కాల్‌సెంటర్ల ద్వారా రుణ యాప్‌లను నిర్వహిస్తున్న కీలక సూత్రదారి మధును దిల్లీలో పట్టుకొన్నారు.

ఇప్పటివరకు 22 కేసులు...

హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన ఆరుగురు నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు బుధవారం న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేసినట్టు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఏవీఎం ప్రసాద్‌ తెలిపారు. తద్వారా మరికొన్ని కీలక ఆధారాలు తెలుస్తాయన్నారు. తాజాగా 5-6 ఫిర్యాదులు వచ్చాయని, రెండు కేసులు నమోదైనట్టు చెప్పారు. ఇప్పటి వరకూ సైబర్‌క్రైమ్‌ పోలీసులు 22 కేసులు నమోదు చేశారని.. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

కాగా టెలీకాలర్స్‌ ఎక్కడి నుంచి మాట్లాడేదీ బయటకు తెలియకుండా యాప్స్‌ ద్వారా స్కూప్‌ కాల్స్‌ చేస్తూ రుణగ్రహీతలను బెదిరించేవారని తేలింది.

‘కీ’లక సూత్రదారి

కొత్తగూడెం పట్టణ నివాసి మధుబాబు సింగి డిగ్రీ వరకూ చదివి కొన్నాళ్లు రుణయాప్‌ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. వాటిపై పట్టు సాధించాక రవికుమార్‌, వెంకట శ్రీవాత్సవ్‌లతో కలసి లియోఫాంగ్‌ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్‌, ఫర్‌ పిన్‌ ప్రింట్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఏర్పాటు చేశాడు. దిల్లీకి చెందిన యాగ్లో ఫిన్‌టెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థతో సేవలందించేలా ఈ ఏడాది జనవరి 27న ఒప్పందం కుదుర్చుకున్నారు.

నగరంలో కార్యాలయం...

హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి మూడు కాల్‌సెంటర్లను ప్రారంభించారు. ఇతడి సోదరులు మనోజ్‌కుమార్‌ సింగి(అసిస్టెంట్‌ మేనేజర్‌), మహేశ్‌కుమార్‌ సింగి(అడ్మిన్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గుడ్‌గావ్‌ నుంచి వచ్చిన కొందరు ఐటీ నిపుణులు ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లలో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. రుణయాప్‌లలో అప్పు తీసుకున్న వారి పూర్తి వివరాలు పొందుపరిచారు.

ఒక్కో కాలర్​కు 60 మంది...

వాటిలో ప్రతి ఒక్కరి ఫోన్‌, ఆధార్‌, స్నేహితులు, బంధువుల నంబర్లు, సామాజిక ఖాతాలుంటాయి. వీళ్లందరితో కలిసి ఒక్కొక్క రుణగ్రహీతకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు ఉంటుంది. టెలీకాలర్‌ ఒక్కొక్కరికి వారి ఫోన్‌ నంబర్‌తో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. ఒక్కో కాలర్‌కు 60 మంది నుంచి అప్పులు వసూలు చేసే బాధ్యతను అప్పగించారు.

ఇవీచూడండి:కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము..!

ABOUT THE AUTHOR

...view details