Mana Uru Manabadi school inauguration in Telangana: రాష్ట్రవ్యాప్తంగా మనఊరు-మనబడి మొదటి విడత పనుల్లో ఆధునీకరించిన 684 పాఠశాలలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 2014, సెప్టెంబరు 17న గంభీరావుపేటలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కేజీ నుంచి పీజీ విద్యా సంస్థల ప్రాంగణం ఏర్పాటు సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1200 పాఠశాలల్ని మెరుగుపర్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడేళ్లలో మూడు దశల్లో రాష్ట్రంలోని 26 వేల 55 పాఠశాలల్లో 12 రకాల సదపాయాలు మెరుగు పరుస్తామని చెప్పారు. ఈ క్యాంపస్‌లో ఒకేసారి వెయ్యి మంది భోజనం చేసేలా అతి పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు సాకారమయ్యాయి. ఇందుకు గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ నిదర్శనం. ‘తెలంగాణ సిద్ధించిన తర్వాత కేజీ టు పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ ప్రతి రూపమే కేజీ టు పీజీ క్యాంపస్. విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాలే అభివృద్ధి సాధిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాం. - మంత్రి కేటీఆర్
దేశంలోని 28 రాష్ట్రాలలో చిన్న వయసు గల రాష్ట్రం తెలంగాణ... కానీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జనహితమే అభిమతంగా అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. సీఎం గొప్ప సంస్కరణలు చేపట్టి, పాలన వికేంద్రీకరణతో పథకాలను ప్రజల చెంతకు చేర్చారని పేర్కొన్నారు.
విమర్శలు సులభమని మంచి పనులు చేసి పేద ప్రజల మనసు గెలుచుకోవడమే కష్టమని అన్నారు. గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యా సంస్థల క్యాంపస్‌కు తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.