తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగా 'మన బడి'.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన 1210 పాఠశాలలు - మన ఊరు మన బడి కార్యక్రమంలో మొదటి దశ పనులు పూర్తి

Mana Uru Mana Badi Program in Telangana: రాష్ట్రంలో 'మన ఊరు-మన బడి' మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,210 బడులు కొత్త అందాలను సంతరించుకున్నాయి.

Mana Uru Mana Badi
మను ఊరు మన బడి

By

Published : Jan 1, 2023, 4:20 PM IST

Mana Uru Mana Badi Program in Telangana : ‘మన ఊరు- మన బడి’ పథకం తొలి విడతలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1210 బడులు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. మోడల్‌ స్కూళ్లుగా పిలుస్తున్న వాటిని జనవరిలోనే ఘనంగా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన నిర్మల్‌లో రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. వాటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ జిల్లాలో కొన్నిటిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు నాటికి అన్నిటినీ ప్రారంభించే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా అధికారులను ఉరుకులు పెట్టిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో డిసెంబరు నాటికి 7,401 చోట్ల పనులు మొదలయ్యాయి. మండలానికి రెండు చొప్పున 1210 బడులను మోడల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని భావించిన సర్కారు వాటిల్లో పనులను డిసెంబరు నెలాఖరుకే పూర్తి చేయాలని ఆదేశించింది. అవి కొలిక్కి రావడంతో జనవరి 5 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. మరమ్మతులు, విద్యుత్తు, వైరింగ్‌ పనులు పూర్తి చేసి.. ప్రస్తుతం రంగులు వేస్తున్నారు.

ఆకుపచ్చ చాక్‌బోర్డుల సరఫరా కూడా మొదలైంది. విద్యార్థులకు డ్యూయల్‌ డెస్కులు, ఉపాధ్యాయులకు బల్లలు, కుర్చీలతోపాటు కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం ఫర్నిచర్‌కు సంబంధించి టెండర్లు కూడా నెల కిందటే ఖరారయ్యాయి. వాటిని జనవరి 10వ తేదీలోపు 1210 పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అయిదు వేల ప్రాథమిక పాఠశాలల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

12 రకాల సౌకర్యాలు ఇవే:ఈ పథకంలో మొత్తం 12 రకాల సౌకర్యాలు కల్పించాలి.

1. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు

2. విద్యుదీకరణ

3. తాగునీరు

4. పిల్లలు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌

5. బడి మొత్తానికి రంగులు

6. పెద్ద, చిన్న తరహా మరమ్మతులు

7. గ్రీన్‌ చాక్‌ బోర్డులు

8. ప్రహరీ

9. వంట గది

10. శిథిల భవనాల స్థానంలో నూతన నిర్మాణాలు

11. భోజనశాల (ఉన్నత పాఠశాలల్లో మాత్రమే)

12. డిజిటల్‌ బోధన సౌకర్యాలు

ఇదీ కార్యక్రమం:

  • తొలి విడతలో ఎంపికైన పాఠశాలల సంఖ్య : 9,123
  • మొత్తం వెచ్చించే నిధులు : రూ.3.497 కోట్లు
  • ప్రారంభానికి సిద్ధమైన బడులు : 1210(ప్రాథమిక- 991, ప్రాథమికోన్నత- 146, ఉన్నత- 73)

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details