కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏపీ కడప జిల్లాలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లాలోని మైదుకూరు మండలం జీవీసత్రంకు చెందిన పూర్వ అసైన్‌మెంట్ కమిటి సభ్యుడు అంకిరెడ్డిపల్లె నారాయణరెడ్డి... అరగుండు, అరమీసంతో నిరసన తెలిపారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు ఉపాధి పొందేలా తనకు భూమి కేటాయించాలని కోరారు.
30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి ఒక ఉద్యోగికి చెందనది కాగా... నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగికి భూమి కేటాయించడంపై ఏపీ లోకాయుక్తను ఆశ్రయించి తాను రద్దు చేయించానని నారాయణరెడ్డి పేర్కొన్నారు. జీవీసత్రం పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా... సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలను నిరసిస్తూ తాను అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టినట్లు తెలిపారు.